
జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రుద్రంగి’. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ చిత్రం జులై 7న రిలీజ్ కానుంది. రీసెంట్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇందులో జగపతి బాబు నటించడం సంతోషంగా ఉంది. ఏదైనా పాత్ర చేసేటప్పుడు అందులో నటించడం కంటే జీవించడం గొప్ప. అలాంటి నటుడే జగపతి బాబు. క్యాన్సర్‌తో పోరాడిన వీర వనిత మమతా మోహన్ దాస్.
వాళ్ళు ఎంత క్షోభ పడతారో క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా నాకు తెలుసు. కానీ ఆమె చాలా ధైర్యంగా ఉండి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు’ అని అన్నారు. జగపతి బాబు మాట్లాడుతూ ‘లెజెండ్ తర్వాత ఎన్నో సినిమాలు చేశాను కానీ అందులో చెప్పుకోదగ్గవి పది కూడా లేవు. ఈ సినిమాతో మళ్లీ నాకు మంచి గుర్తింపు వస్తుందనుకుంటున్నా. తెలంగాణ సినిమా ఇది. అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది’ అని చెప్పారు. స్వాతంత్ర్యం తర్వాత ఆనాటి తెలంగాణ పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందన్నారు దర్శక నిర్మాతలు. ఆశిష్ గాంధీ, మమత మోహన్ దాస్, గాహ్నవి, దివి, చరిష్మా సహా టీమ్ అంతా పాల్గొన్నారు.