పరిచయం : మ్యూజిక్​ వీడియోలతో మొదలైంది

పరిచయం : మ్యూజిక్​ వీడియోలతో మొదలైంది
  • జీఆర్​టీ జువెలర్స్, పారాచ్యూట్ ఆయిల్, క్లోజ్​–అప్​, హెయింజ్ టొమాటో కెచప్, కళ్యాణ్​ జువెలర్స్ యాడ్స్​లో నటించా 
  • ‘ఆగ్రా’ సినిమాని మెల్​బోర్న్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లో ప్రదర్శించబోతున్నారు. ఆ సినిమా 2019లోనే షూటింగ్​ పూర్తయింది. అందులో నాది డార్క్​ క్యారెక్టర్,. ఆ క్యారెక్టర్​ పేరు ఆగ్రా.

‘‘హీరోయిన్ అంటే గ్లామర్​ రోల్స్​ కోసమే కాదు. పర్ఫార్మెన్స్ ఉన్న పాత్రలు చేసే అవకాశం వస్తే నటించడానికి రెడీగా ఉంటారు. నేనూ అంతే... మొదటి నుంచి నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్​ చూశానే తప్ప గ్లామర్​ పాత్రలతో సరిపెట్టుకోను’’ అంటోంది రుహానీ శర్మ. ‘చి.ల.సౌ.’ సినిమాలో అంజలి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం పోలీస్​ ఆఫీసర్​గా ‘హర్: చాప్టర్​1’లో లీడ్​ రోల్​లో నటించింది. మొదటినుంచీ పర్ఫార్మెన్స్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ డిఫరెంట్​ స్క్రిప్ట్​లతో ఆడియెన్స్​ ముందుకొస్తోంది రుహానీ. 

హిమాచల్​ ప్రదేశ్​లో పుట్టి, తెలుగు తెర మీద మెరిసిపోతున్న రుహానీ శర్మ ఇంట్రెస్టింగ్​ జర్నీ ఆమె మాటల్లోనే... ‘‘మాది హిమాచల్​ ప్రదేశ్​లోని సోలన్​. నాన్న పేరు సుభాష్​ శర్మ. అమ్మ ప్రాణేశ్వరి. నాకో సిస్టర్​. తన పేరు శుభి శర్మ. మాది మిడిల్ క్లాస్​ ఫ్యామిలీ. చండీగఢ్​​లోని పంజాబ్​ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. చిన్నప్పటి నుంచే మోడలింగ్, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్​ ఉండేది. కాలేజీలో చదివేటప్పుడు మోడలింగ్​ చేయాలని డిసైడ్​ అయ్యా. 2013లో ఒక మ్యూజిక్ వీడియో కోసం మోడలింగ్​ చేశా. అదే నా కెరీర్​కి మొదటి మెట్టు. ‘కుడి తు పటాకా’ అనే పంజాబీ సాంగ్​ అది. ఆ సాంగ్​ హిట్​ కావడంతో మ్యూజిక్ వీడియోల్లో బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. అలా ‘క్లాస్ రూమ్’, ‘డేట్’, ‘మేరీ జాన్’, ‘బుల్లెట్ వర్సెస్ చమ్మక్​ చల్లో’ వంటి వీడియోలకు చేశా. 

ప్రయత్నం ఆపలేదు​ 

ఒకవైపు మ్యూజిక్​ వీడియోలు చేస్తూ.. అదే టైంలో సినిమాలు, సీరియల్స్​కి ఆడిషన్స్​ ఇచ్చేదాన్ని. అలా చాలా ఆడిషన్స్​కి వెళ్లా. కానీ ఒక్క అవకాశం కూడా రాలేదు. అయినా నేను ట్రై చేయడం మాత్రం మానలేదు. అప్పుడప్పుడు అడ్వర్టైజ్​మెంట్స్​లో కూడా చేశా. ఆ తర్వాత 2017లో తమిళంలో ఒక సినిమా అవకాశం వచ్చింది. హీరో భరత్ నటించిన ‘కడైసి బెంచ్ కార్తి’ అనే సినిమా అది. ​ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాతి ఏడాది 2018లో తెలుగులో సుశాంత్​ హీరోగా ఉన్న ‘చి.ల.సౌ.’  సినిమా ఛాన్స్ వచ్చింది. అది నా లైఫ్​ని మలుపు తిప్పింది. ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాని తర్వాత మలయాళంలో కూడా అవకాశం వచ్చింది. అది థ్రిల్లర్​ మూవీ. పేరు ‘కమల’. 2019లో వచ్చింది ఆ సినిమా. అందులో టైటిల్​ రోల్​ కమలగా డార్క్​ క్యారెక్టర్​లో నటించా.

ఈ సినిమాతో పాటు ‘పాయిజన్’ అనే హిందీ వెబ్​ సిరీస్​లో కూడా నటించా. అది కూడా అదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలా మూడేండ్లలో నాలుగు భాషల్లో నటించే అవకాశం దక్కింది. ఈ విషయంలో నేను చాలా లక్కీ. ఆ తర్వాత మళ్లీ తెలుగులోనే ‘హిట్​: ద ఫస్ట్​ కేస్’, ‘డర్టీ హరీ’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలాగే 2022లో ‘మీట్​ క్యూట్’ అనే వెబ్​ సిరీస్​లో కూడా చేశా. లేటెస్ట్​గా ‘హర్: చాప్టర్ 1’తో మీ ముందుకొచ్చా. వెంకటేశ్​ నటిస్తున్న ‘సైంధవ్’, ‘ఆగ్రా’, ‘బ్లాక్​అవుట్’,‘శ్రీరంగ నీతులు’ సినిమాల్లో నటిస్తున్నా. 

కష్టపడి ఇష్టంగా చేశా

నిజానికి నాకు లవ్​ స్టోరీస్​, సైకలాజికల్​ థ్రిల్లర్ మూవీస్​లో యాక్ట్ చేయడం ఇష్టం. ‘చి.ల.సౌ.’ ఒకలాంటి లవ్​ స్టోరీ. ఇప్పటికీ నా కెరీర్​ గురించి మాట్లాడాలంటే ఫస్ట్​ ఇదే ఉంటుంది. ఈ సినిమా ఆడిషన్​కి వెళ్లినప్పుడు మేకప్​ లేకుండా నా లుక్​ ఎలా ఉంటుందో చూశారు. ఆ తర్వాతే నాకు అవకాశం ఇచ్చారు. షూటింగ్​ స్టార్ట్​ అయ్యాక డైలాగ్స్ చెప్పడానికి వేలసార్లు రిహార్సల్ చేసేదాన్ని. ఒక సీన్​లో పెద్ద డైలాగ్​ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అనిపించింది. డైరెక్టర్​ రాహుల్​ ‘నీ పాత్ర చాలా కోపంగా ఉంటుంది. కాబట్టి ఆ కోపంలో ఫాస్ట్​గా డైలాగ్​ చెప్పాలి. మధ్యలో కట్​ ఉండదు..’ అని చెప్పాడు. అలా చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా అది. 

ఈ సినిమాలో క్యారెక్టర్​ చాలా సీరియస్​గా, సింపుల్​గా ఉండే అమ్మాయి. డైరెక్టర్​కి క్లారిటీ ఉంది. ఆయన చెప్పినట్లు చేస్తేనే సక్సెస్ అవుతాం అనే విషయం నాకు అర్థమైంది. నాకు క్యారెక్టర్, అందులో నా పర్ఫార్మెన్స్​ ముఖ్యం. అందుకే ఈ క్యారెక్టర్​ చేశా. చాలామందికి తెలియని విషయమేంటంటే.. ఇప్పుడు వచ్చిన ‘హర్ : చాప్టర్​ 1’ మూవీ రావడానికి కారణం కూడా చి.ల.సౌ. ‘హర్..’ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ‘నో’ చెప్పాలనుకున్నా. ఎందుకంటే నన్ను పోలీస్​ ఆఫీసర్​గా చూసుకోవాలంటే నాకే కొత్తగా అనిపించింది. అలాంటిది నేను లీడ్ రోల్​లో పోలీస్​గా యాక్ట్​ చేయడం అంటే సాహసమే అనుకున్నా. పైగా డైరెక్టర్​కి ఇది డెబ్యూ. సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా అమెరికాలో ఉద్యోగం చేసి, సినిమా తీయడానికి వచ్చాడు. ఇవన్నీ ఆలోచించాక ఈ స్ర్కిప్ట్​ ‘నేను చేయను’ అని చెప్పడానికి వెళ్లా. కానీ డైరెక్టర్​ చి.ల.సౌ.లో నా పర్ఫార్మెన్స్ చూసి ‘మీరు చేయగలరు’ అని.. కథ మొత్తం చెప్పాడు. అతనికి ఉన్న క్లారిటీ, విజన్, రైటింగ్​ స్టయిల్ నచ్చాయి. అలా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. 

పోలీస్​గా మారాలని...

ఈ క్యారెక్టర్​ కోసం చాలా డాక్యుమెంటరీలు చూశా. రియల్​ పోలీస్​ ఆఫీసర్స్​ని కలిసి వాళ్లతో మాట్లాడా. ‘ఢిల్లీ క్రైమ్’ సిరీస్​ చూశా. వెపన్స్, మార్షల్​ ఆర్ట్స్‌ ట్రైనింగ్ కూడా తీసుకున్నా. తినేటప్పుడు, ట్రావెలింగ్​ చేసేటప్పుడు, వేరే పనిలో ఉన్నప్పుడు కూడా పోలీస్​ క్యారెక్టర్​ గురించే ఆలోచించేదాన్ని. పోలీస్ డ్రెస్ వేసుకుంటే ఆటోమెటిక్​గా నా బాడీ లాంగ్వేజ్​ మారిపోతుంది. మామూలుగా నా వాకింగ్​ స్టైల్ ఒకలా ఉంటుంది. కానీ, క్యారెక్టర్​ చేస్తున్నప్పుడు వేరేలా మారిపోతుంది. ‘హర్ : చాప్టర్ 1’లో నా పాత్ర పేరు అర్చన. ఇప్పటివరకు ‘చి.ల.సౌ.’లో అంజలి పాత్రను ప్రజలు బాగా ఆదరించారు. ఇప్పటికీ అలానే గుర్తుపడుతుంటారు కూడా. అంజలి తర్వాత నాకు బాగా కనెక్ట్ అయిన పేరు అర్చన.

ఓటీటీ వల్లే...

ఒక మంచి రోల్​లో నటించాలంటే స్టార్​ అయ్యుండాల్సిన పనిలేదు. ఓటీటీ వచ్చాక స్క్రిప్ట్స్​, యాక్టింగ్, యాక్టర్స్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. చాలామంది ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడి టీవీ చూడటం మానేస్తున్నారు. ఫిమేల్ యాక్టర్స్ అంటే సాంగ్, డాన్స్ అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా లేదు.. వెరైటీ స్క్రిప్ట్​లతో గుర్తుండిపోయే పాత్రల్లో నటిస్తున్నారు.”

:::ప్రజ్ఞ