
జూనియర్ ఎన్టీఆర్ , దర్శకుడు ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'డ్రాగన్' . ఈ భారీ యాక్షన్ డ్రామా మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమకు సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్ సరసన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ నటించనున్నట్లు నిర్మాత ఎన్. వి. ప్రసాద్ వెల్లడించారు. మలయాళ చిత్రం 'మధరాసి' ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
కొత్త హీరోయిన్, భారీ అంచనాలు
'సప్త సాగరాలు దాటి' చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న రుక్మిణి వసంత్, ఇప్పుడు ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతుండడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఎన్టీఆర్, రుక్మిణి వసంత్ కాంబినేషన్ ఈ సినిమాకు మరింత గ్లామర్ తీసుకొస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం 'మధరాసి' , 'కాంతార -చాప్టర్ 1లో నటించింది. ఇవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు చిత్రాల్లో కూడా నటిస్తోంది.
పాన్- ఇండియన్ ప్రాజెక్ట్
'కేజీఎఫ్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇటీవల కుమ్టాలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం, త్వరలో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. దీని కోసం భారీ సెట్లను ఇప్పటికే సిద్ధం చేశారు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కోసరాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాంకేతిక బృందంలో రవి బస్రూర్ సంగీతం, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ, చలపతి ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రం జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మూవీ మేకరర్స్ ప్రణాళిక సిద్ధం చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ సినిమా అతిపెద్ద పాన్-ఇండియన్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.