ఫ్లైట్‌ జర్నీ చేసే వారికి ఇవే కొత్త రూల్స్‌

ఫ్లైట్‌ జర్నీ చేసే వారికి ఇవే కొత్త రూల్స్‌
  • ఎస్‌ఓపీ రిలీజ్‌ చేసిన ఏఏఐ

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు రెండు నెలల పాటు నిలిచిపోయిన విమాన సర్వీసులు మళ్లీ షురూ కానున్నాయి. ఈ నెల 25 నుంచి దశలవారీగా డొమెస్టిక్‌ ఫ్లైట్లను నడపనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు ఫ్లైట్‌ జర్నీకి సంబంధించి ఎయిర్‌‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) గురువారం స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌‌ (ఎస్‌ఓపీ)ను రిలీజ్‌ చేసింది. ఫ్లైట్‌ జర్నీ చేసేవాళ్లు పాటించాల్సిన జాగ్రత్తలు, కొత్త రూల్స్‌ను రిలీజ్‌ చేసింది. ప్యాసింజర్లు కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, థర్మల్‌ స్క్రినింగ్‌ చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఫ్లైట్లలో సోషల్ డిస్టెంసింగ్‌ పాటించేందుకు మధ్య సీట్లను వదిలేస్తారని వచ్చే వార్తల్లో నిజం లేదని ఏఏఐ ప్రకటించింది. అలా సీట్లను ఖాళీగా వదిలేస్తే ఫ్లైట్‌ టికెట్లు పెరిగే అవకాశం ఉన్నందున దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఎయిర్‌‌పోర్ట్‌లలో కాంటాక్ట్‌ లెస్‌ టికెట్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. టికెట్‌పై బార్‌‌కోడ్‌ సాయంతో ప్యాసింజర్లను అనుమతించాలని చూస్తున్నామని అధికారులు చెప్పారు. ఎయిర్‌‌పోర్ట్‌లో ప్రతి చోట సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేలా చర్యలు తీసుకున్నామని, దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, మార్కింగ్‌ కూడా చేశామని అన్నారు.కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 25 నుంచి ఫ్లైట్లు నిలిపేసిన కేంద్రం కేవలం కార్గో, విదేశాల్లో చిక్కుకున్న మన వారి కోసం ఏర్పాటు చేసిన ఫ్లైట్లను మాత్రమే నడిపింది. కాగా.. ఇప్పుడు కేవలం డొమస్టిక్‌ ఫ్లైట్లను మాత్రమే తిరిగి స్టార్ట్‌ చేసింది.

ఎస్‌ఎపీలోకి ముఖ్యమైన పాయింట్లు

  • ప్యాసింజర్లు రెండు గంటల ముందే ఎయిర్‌‌పోర్ట్‌కు చేరుకోవాలి.
  •  ఫ్లైట్‌ టైమ్‌కి నాలుగు గంటల ముందు మాత్రమే ఎయిర్‌‌పోర్ట్‌లోకి అనుమతిస్తారు. అంత కంటే ముందే వెళ్లి వెయిట్‌ చేసేందుకు పర్మిషన్‌ లేదు.
  •  ప్రతి ఒక్కరికి మాస్క్‌, గ్లౌజ్‌ కంపల్సరీ
  •  ప్రతి ఒకరి ఫోన్‌లో ఆరోగ్యసేతు యాప్‌ కంపల్సరీ. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవాలి. ఆరోగ్య సేతు యాప్‌ లేకపోతే నో ఎంట్రీ. 14 ఏళ్ల లోపు పిల్లలకు ఆరోగ్యసేతు యాప్‌ అవసరం లేదు.
  •  ప్యాసింజర్లు, ఎయిర్‌‌లైన్‌ సిబ్బంది కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ లేదా ప్రైవేట్‌ ట్యాక్సీలు ఏర్పాటు చేయాలి.
  •  పర్సనల్‌ వెహికిల్స్‌, సెలెక్టడ్‌ క్యాబ్‌ సర్వీసులను మాత్రమే ఎయిర్‌‌పోర్ట్‌లోకి అనుమతిస్తారు.
  •  ప్రత్యేక సందర్భాల్లో మినహా ట్రాలీలు అనుమతించరు.