కోట్ల విలువైన భూమిపై రూలింగ్​ పార్టీ లీడర్ కన్ను​

కోట్ల విలువైన భూమిపై రూలింగ్​ పార్టీ లీడర్ కన్ను​

ఖమ్మం/ కూసుమంచి/ ముదిగొండ, వెలుగు: జిల్లాలో విలువైన ప్రభుత్వ, దేవాలయ భూములను కొందరు అధికార పార్టీ నేతలు ఆక్రమించేస్తున్నారు. కొత్త కొత్త ప్లాన్లు వేస్తూ, ఆ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడంతో రూ.కోట్ల విలువైన భూములు అక్రమార్కుల పాలవుతున్నాయి. కూసుమంచి మండలం జుజ్జులరావుపేట సర్వే నెంబర్​ 219 లో రెండెకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొత్తగా నిర్మించిన ఖమ్మం – సూర్యాపేట హైవేను ఆనుకొని ఉండడంతో ప్రస్తుతం దాని విలువ రూ.3 కోట్లకు చేరింది. ఇటీవల ప్రభుత్వం ఇక్కడ ఎలక్ట్రికల్ కార్లు, బైక్​లు చార్జింగ్  పెట్టుకునేలా చార్జింగ్  స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ  స్థలం మీద కన్నేసిన అధికార పార్టీ లీడర్​ ఒకరు 10 రోజుల క్రితం రాత్రికి రాత్రే అక్కడ హనుమాన్​ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. అయ్యప్ప మాలధారులు పది రోజుల నుంచి రెగ్యులర్​ గా వెళ్లి పూజలు చేస్తున్నారు.

అధికారులు, పోలీసులకు కంప్లైంట్..​

కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ని కబ్జా చేసేందుకు ప్లాన్​ వేశారని గుర్తించిన కొందరు గ్రామస్తులు, రెవెన్యూ అధికారులకు, పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో 24 గంటల్లో విగ్రహాన్ని తొలగించాలంటూ కూసుమంచి తహసీల్దార్, ఎస్ఐ అక్కడ పూజలు చేస్తున్న వారికి చెప్పారు. ఇక ఈ విగ్రహ ఏర్పాటు గురించి స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్​ రెడ్డికి కొందరు గ్రామస్తులు చెప్పగా, ఆయన కూడా ఆ లీడర్లను పిలిపించి కోప్పడ్డట్టు తెలిసింది. దేవాలయానికి స్థలం కావాలంటే తహసీల్దార్​కు వినతిపత్రం ఇవ్వాలే తప్ప రాత్రికి రాత్రి ఎందుకు విగ్రహం పెట్టారని నిలదీశారు. గ్రామస్తులు మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే చెప్పినా, సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. 10 రోజుల నుంచి తహసీల్దార్​ సెలవులో ఉండగా, ఇన్​చార్జి తహసీల్దార్​ మాత్రం ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగిస్తామని చెబుతున్నారు. అయితే స్థానిక లీడర్ల ఒత్తిడి కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ కబ్జాకు ప్లాన్​ చేసిన చోటా లీడర్​ ఇప్పటికే అదే గ్రామంలో చెరువు శిఖం భూములను కబ్జా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

మునిగేపల్లిలో దేవాదాయ భూమి..

ఇక కూసుమంచి మండలం మునిగేపల్లిలో రెండెకరాల దేవాదాయ భూమి అన్యాక్రాంతమైంది. ముదిగొండ మండలం మాధాపురంలోని హనుమాన్​ ఆలయానికి చెందిన దేవుడి మాన్యం మునిగేపల్లి రెవెన్యూలో 153/ఉ లో 2 ఎకరాల 10 గుంటలు ఉంది. 1994–95లో ఉన్న పహాణీల్లో దేవుడి భూములుగానే ఉండగా, 2009–10 నాటికి ఇద్దరి పేర్ల మీదకు బదిలీ అయింది. ప్రస్తుతం ధరణిలో కూడా ఇద్దరి పేరుతో రిజిస్ట్రేషన్  అయినట్టుగా చూపిస్తోందని కొందరు గ్రామస్తులు ముదిగొండ తహసీల్దార్​కు కంప్లైంట్ చేశారు. దేవాలయం ఒక మండలంలో ఉండడం, మన్యం భూమి మరో మండలంలో ఉండడంతో ఈ కంప్లైంట్ పై ఇంత వరకు ఎంక్వైరీ కూడా చేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. అయితే తాము ఫిర్యాదు చేసినా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో వారి పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.