Rupee Vs Dollar: మరో చెత్త రికార్డ్ కొట్టిన రూపాయి.. డాలర్ @ 95.93

Rupee Vs Dollar: మరో చెత్త రికార్డ్ కొట్టిన రూపాయి.. డాలర్ @ 95.93

రోజురోజుకూ రూపాయి విలువ పడిపోతూ చెత్త రికార్డులను నమోదు చేస్తోంది. దీంతో భారత కరెన్సీ రూపాయి విలువ పాతాళానికి పడిపోతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మే 14, గురువారం నాటి ట్రేడింగ్‌లో రూపాయి విలువ ఏకంగా 95.93 స్థాయికి దిగజారి సరికొత్త రికార్డు స్థాయి పతనాన్ని నమోదు చేసింది. మే 12 నుంచి మే 14 వరకు జరిగిన ప్రతి ట్రేడింగ్ సెషన్‌లోనూ రూపాయి కొత్త కనిష్టాలను తాకుతూ ముందుకు సాగుతోంది. కేవలం ఈ ఒక్క వారంలోనే రూపాయి విలువ దాదాపు 1.4 శాతం మేర క్షీణించింది.

రూపాయి పతనానికి ప్రధానంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 106 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇరాన్ వివాదం, ప్రపంచ ఇంధన సరఫరాలో అనిశ్చితి కారణంగా క్రూడ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన దేశచమురు అవసరాలలో దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ రూపాయిపై ఒత్తిడి పెరుగుతూనే ఉంది.

మరో పక్కన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరగనున్న కీలక భేటీపై మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా ఈ ప్రభావంతో ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. రూపాయి విలువ నిరంతరం క్షీణించడం వల్ల దిగుమతులు ఖరీదుగా మారటమే కాకుండా.. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవటం కూడా రూపాయికి ఊపిరి సలపనివ్వటం లేదు. RBI ఈ పతనాన్ని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.