డబుల్ జోష్.. ఊళ్లలో ఇటు ఎన్నికల హడావిడి.. అటు పండుగల సంబరాలు

 డబుల్ జోష్.. ఊళ్లలో ఇటు ఎన్నికల హడావిడి.. అటు పండుగల సంబరాలు

 

  • దసరా.. దీపావళి ఉండటంతో  ఆశావహులకు పెరగనున్న ఖర్చులు
  • క్యాండిడేట్ల ఎంపికపై పార్టీల ఫోకస్​
  • బీసీల స్థానాలు పెరగడంతో ఆ వర్గాల్లో అంతర్గత పోటి    

హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో ఎలక్షన్​జోష్​ఊపందుకున్నది. దాదాపు ఏడాదిన్నరకు పైగా పాలక వర్గాలు లేకపోవడం, ఇప్పుడు షెడ్యూల్​రిలీజ్ చేయడంతో ఊర్లలో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం హీటెక్కింది. వార్డు మెంబర్​దగ్గరి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా పోటీ చేయాలని ఆశపడిన వాళ్లందరూ ఇప్పుడు ఆ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. స్థానిక ఎన్నికలు వస్తాయని గత కొంత కాలం నుంచే ప్రచారం ఊపందుకోవడంతో కొంతమంది ఆశావహులు గ్రామాల్లో యూత్‌‌‌‌‌‌‌‌ను ఆకట్టుకునేందుకు స్పోర్ట్స్​కిట్స్ ఇవ్వడం, వినాయక చవితికి విగ్రహాలు కొనివ్వడం, వార్డుల్లో ఉన్న సమస్యలపై ఆరా తీయడం వంటివి చేస్తూ వచ్చారు. ఇప్పుడు షెడ్యూల్​రావడంతో పూర్తిగా ఫోకస్​ పెంచారు. 

దసరా పండుగ ఉండటంతో మటన్​, చికెన్​పంపిణీతో పాటు లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పంపి ముందే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడుతున్నారు. పైగా విడతల వారీ ఎన్నికల్లో దీపావళి కూడా వస్తుండటంతో ఈసారి ఖర్చు ఎక్కువే అవుతుందనే చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో డైరెక్ట్ క్యాష్ కంటే ఈ రకమైన ఖర్చు ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. పండుగలను దృష్టిలో ఉంచుకొని ఆశావహులు తమ పరిధిలో మరింత వ్యయప్రయాసలకు సిద్ధమవుతున్నారు. 

అభ్యర్థుల ప్రయత్నాలు ముమ్మరం..

 ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే అంతిమ లక్ష్యం కాబట్టి, ప్రధాన రాజకీయ పార్టీల ఫోకస్ కూడా క్యాండిడేట్ల ఎంపికపైనే ఉన్నది. ఎమ్మెల్యేలు  పార్టీ మండల, గ్రామ శాఖ అధ్యక్షులు, యాక్టివ్‌‌‌‌‌‌‌‌గా ఉన్న లీడర్లు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్న వాళ్లు  గ్రామాల నుంచి పర్సనల్​గా వెళ్లి ఎవరికి వారు స్థానిక ఎమ్మెల్యేలను కలిసి తమ ఆసక్తిని కనబరుస్తున్నారు. 

తన బలం ఎక్కువ అని చూపించేందుకు కార్యకర్తలను కూడా క్యాష్​తో మభ్యపెట్టి ఎమ్మెల్యేల దగ్గరకు బలగంతో వెళ్లి కలిసే ప్లాన్​ చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టుకుంటారో కూడా బహిరంగంగానే చెబుతున్నారు.

 ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తులతో పాటు వ్యక్తిగత ఇమేజ్, స్థానిక బలం కీలకం కానుంది. దీంతో   రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే, బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపడానికి పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ప్రజల్లో పట్టున్న, వ్యక్తిగతంగా మంచి పేరున్న నాయకులను ఎంపిక చేసే ప్రక్రియను పార్టీలు వేగవంతం చేశాయి. కుల సమీకరణలు, ఆర్థిక బలం, స్థానిక సత్తా వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ.. వివాదాలు లేని, గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే టికెట్ (లేదా మద్దతు) ఇచ్చేందుకు  ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు.  

బీసీల్లోనూ అంతర్గత పోటీ 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచడంతో ఆ వర్గానికి వార్డు మెంబర్ల దగ్గరి నుంచి ఎంపీటీసీ, సర్పంచ్​స్థానాలు గణనీయంగా పెరిగాయి. దీంతో వారిలోనూ అంతర్గత పోటీ ఊహించని స్థాయిలో పెరిగింది. బీసీల్లోని వివిధ కులాలకు చెందిన ఆశావహులు ఇప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. 

టికెట్ కోసం కేవలం బీసీ కోటాపైనే కాకుండా, తమ గ్రామంలో లేదా వార్డులో తమ కులం ఓటు బ్యాంకు ఎంత బలంగా ఉంది? అనే లెక్కలతో పోటీకి సిద్ధమవుతున్నారు. ఒకే గ్రామంలో బలమైన రెండు బీసీ కులాలు ఉంటే, ఆ రెండు కులాల మధ్యే టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఏర్పడుతోంది. 

నియోజకవర్గాల్లో బలంగా ఉన్న ఆ వర్గ నాయకులు, కార్యకర్తలు పార్టీ నుంచి టికెట్ కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అన్ని ప్రధాన పార్టీలు బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించడానికి, బలమైన బీసీ నాయకులను బరిలోకి దించాలని చూస్తున్నాయి. దీంతో వివిధ బీసీ కులాలకు చెందిన ఆశావహులు తమ పలుకుబడిని ఉపయోగించి, టికెట్ దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.