రూర్బన్​ పనులు ముందు పడట్లే

రూర్బన్​ పనులు ముందు పడట్లే
  • పనులు చేసినా బిల్లులు ఆలస్యం కావడంతో కాంట్రాక్టర్ల తిప్పలు
  • భూములిచ్చిన బాధితులకు న్యాయం చేయని లీడర్లు

మహబూబ్​నగర్​/గండీడ్​, వెలుగు: జిల్లాలో చేపట్టిన రూర్బన్​ పనులు పూర్తి కాలేదు. ఈ పనుల కోసం భూములు ఇచ్చిన పేదలకు న్యాయం జరగడం లేదు. భూములు అప్పగించిన సమయంలో బాధితులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. దీనికితోడు ఆరేళ్లు కావస్తున్నా పనులు అసంపూర్తిగా ఉండడంతో బాధితులు భూమి కోల్పోయి, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్లకూ బిల్లులు రాక తలలు పట్టుకుంటున్నారు. మహబూబ్​నగర్​ జిల్లా ఉమ్మడి గండీడ్​ మండలంలోని నంచర్ల క్లస్టర్​ను 2018లో రూర్బన్​ స్కీం కింద ఎంపిక చేశారు. స్కీంలో భాగంగా రూ.30 కోట్లతో  డెవలప్​మెంట్​ పనులు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా గండీడ్​లో బల్క్​ మిల్క్​ సెంటర్​, ఆడిటోరియం, గోదాం, దాల్​ మిల్ నిర్మాణాల కోసం 40 ఎకరాలను సేకరించాల్సి  ఉండగా, గండీడ్​ శివారులోని సర్వే నంబర్ 313, రెడ్డిపల్లిలోని శివారులోని సర్వే నంబర్​లోని 40లోని భూమిని కేటాయించారు. ఇందులో 10 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. భూములు ఇచ్చినందుకు గాను వీరికి ప్రభుత్వం తరపున డబుల్​ బెడ్రూమ్​ ఇళ్లు, అర్హత ఉన్న వారికి ఏర్పాటు చేసిన మిల్లుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇంత వరకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. పైగా పనులు  ఆరేళ్లు కావస్తున్నా కంప్లీట్​ కాలేదు. 

ఇన్​కంప్లీట్​గా పనులు..

రూర్బన్​ కింద 300 రకాల పనులు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా ఉమ్మడి గండీడ్​ మండలంలోని 24 గ్రామ  పంచాయతీల్లో డంపింగ్​యార్డులు, క్రిమిటోరియం, వీధిలైట్లు, సీసీ రోడ్లు, అంగన్​వాడీ భవనాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, సైన్స్​ ల్యాబ్​లు, పాఠశాలలో లైబ్రరీలు, అడిషనల్​ క్లాస్​ రూమ్స్​ పూర్తి చేశారు. ఇవి కాకుండా -మహమ్మదాబాద్​ మండలంలోని జూలపల్లిలో  రూ.78 లక్షలతో  ఎకో పార్కు అభివృద్ధి పనుల్లో పురోగతి లేదు. గండీడ్​ మండల కేంద్రంలో కన్వెన్షన్ ​హాల్​, పప్పు మిల్లు పునాది దశలోనే ఉన్నాయి. గోదాం పనులు స్లాబ్​ దశలో ఆగిపోయాయి. హార్టికల్చర్​కు సంబంధించిన పనులకు ఇంత వరకు టెండర్లు పిలవలేదు. అలాగే బల్క్​ మిల్క్​ సెంటర్ నిర్మాణం పూర్తి కాగా, మెయిన్​ రోడ్డు నుంచి మిల్క్​ సెంటర్​ వరకు రోడ్డు వేయాల్సి ఉంది. ఈ పనులు చేపట్టకపోవడంతో ఇంత వరకు ఈ సెంటర్​ను ప్రారంభించలేదు. ఆడిటోరియం చుట్టూ వాల్​ను ఏర్పాటు చేసినా పైకప్పు కంప్లీట్​ చేయలేదు. 

బిల్లులు ఆలస్యంతో..

2018లో ఈ పనులు ప్రారంభించగా, 2022 మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ, ఆ ఏడాది పనులు కంప్లీట్​ కాకపోవడంతో గడువును మరో ఏడాది పొడిగించారు. దీంతో ఈ ఏడాది మార్చి వరకు పనులు కంప్లీట్​ చేయాల్సి ఉంది. కానీ, గతంలో చేసిన పనులకు సంబంధించి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడంలో ఆలస్యం చేయడంతో  కాంట్రాక్టర్లు పెండింగ్​ పనులు కంప్లీట్​ చేయడానికి ముందుకు రావడం లేదు. ఫండ్స్​ ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నా.. కాంట్రాక్టర్లు మాత్రం బిల్లుల్లో ఆలస్యమై ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.

హామీలు నెరవేరుస్తాం..

రూర్బన్​ పనులను త్వరలో పూర్తి చేస్తాం. కాంట్రాక్టర్లతో మాట్లాడి పెండింగ్​ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. భూ బాధితులకు డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు కేటాయిస్తాం. మిల్లుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అర్హత ఉన్న వారికి దళితబంధు కింద విడతల వారీగా స్కీం వర్తింపజేస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన 
అవసరం లేదు.
–కొప్పుల మహేశ్​రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి

వెంటనే బిల్లులు చేస్తాం..

రూర్బన్​ కింద చేసిన పనులకు గతంలో ఫండ్స్​ లేక బిల్లులు చేయడం ఆలస్యమైంది. ప్రస్తుతం ఫండ్స్​ రెడీగా ఉన్నాయి. పనులు చేసిన వెంటనే బిల్లులు చేస్తాం. పెండింగ్​లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
–యాదయ్య, డీఆర్డీవో

బిల్లులు ఆలస్యం చేస్తున్నారనే..

రూ.1.25 కోట్లతో మినీ స్టేడియం పనులు చేయాల్సి ఉండగా, 80 శాతం పనులు రెండేండ్ల కింద పూర్తి చేశాం. ఈ పనులు చేసిన ఏడాదికి రూ.60 లక్షల బిల్లులు చేశారు. ఇంకా కొంత డబ్బు రావాల్సి ఉంది. పూర్తిగా పని చేద్దామంటే.. డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. ముందుకొచ్చి పనులు చేయాలంటే భయం వేస్తోంది.
–సత్యనారాయణరెడ్డి, కాంట్రాక్టర్