రూటు మార్చిన రష్యా.. దక్షిణ ప్రాంతాల్లో దాడులు

రూటు మార్చిన రష్యా.. దక్షిణ ప్రాంతాల్లో దాడులు
  • ఉక్రెయిన్ సిటీలపై రష్యా మిసైళ్లు
  • ఒడెస్సా ఇండస్ట్రియల్ ఏరియాలో మూడు చోట్ల పేలుళ్లు
  • ఉక్రెయిన్‌‌కు నల్ల సముద్రంతో సంబంధాలను తెంచేందుకు ప్లాన్

కీవ్/ఒడెస్సా:  ఉక్రెయిన్ లో ఉత్తరం వైపున రష్యా తన బలగాలను తగ్గిస్తూ.. దక్షిణాదిన దాడులకు దిగుతుందంటూ ఉక్రెయిన్ ఆర్మీ వేసిన అంచనా నిజమైంది. నల్ల సముద్రంలో ఉక్రెయిన్‌‌కు వ్యూహాత్మకమైన ఒడెస్సా పోర్టుపై రష్యా వైమానిక దాడులు చేసింది. ఆదివారం ఉదయం సిటీలోని ఇండస్ట్రియల్ ఏరియాలో మూడు చోట్ల పేలుళ్లు జరిగాయని, దీంతో భారీగా పొగ అలుముకున్నదని ఉక్రెయిన్ మంత్రి ఆంటోన్ హెరాశ్చెన్‌‌కో తెలిపారు. తర్వాత మైకోలైవ్‌‌పైనా మిసైల్ దాడులు జరిగినట్లు సిటీ మేయర్ అలెగ్జాండర్ సెంకెవిచ్ తెలిపారు. ఉక్రెయిన్‌‌కు నల్ల సముద్రంతో సంబంధాలను పూర్తిగా తెంచివేసేందుకు రష్యా ఈ దాడులకు దిగుతున్నది. ఒడెస్సాలోని ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్, ఇంధన డిపోలపై మిసైళ్లు ప్రయోగించింది. మైకోలైవ్‌‌కు దగ్గర్లో ఉక్రెయిన్ దళాలకు ఇంధనాన్ని అందజేసేందుకు ఉపయోగిస్తున్న ఫెసిలిటీస్‌‌పైనా దాడులు చేసింది. కోస్టియంటినివ్కా, ఖ్రెసిష్చేలోని ఆయుధ డిపోలను పేల్చేసింది. 

ఒకే చోట 300 మంది ఖననం 

రాజధాని కీవ్‌‌కు అతి దగ్గర్లోని బుచా నగరంలో రష్యా దళాలు విధ్వంసం సృష్టించాయి. రష్యన్ల దాడుల్లో చనిపోయిన 300 మందిని ఒకే ప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు సిటీ మేయర్ ఆంటోలీ ఫెడొరుక్ చెప్పారు. ఆ 300 మందిని తల వెనుక వైపు కాల్చి చంపారని వెల్లడించారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై కాల్పులు జరుపుతున్నారని ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ అంబుడ్స్‌‌మన్ లియుడ్‌‌మిలా డెనిసోవా చెప్పారు. రష్యా దళాల అధీనంలోని ఎనెర్హోడర్‌‌‌‌ సిటీలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఉక్రెయిన్‌‌పై దాడికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌పై అరెస్టు వారంట్ జారీ చేయాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును యుద్ధ నేరాల ప్రాసిక్యూటర్ కార్లా డెల్ పోంటే కోరారు.

పూర్తిగా ఉక్రెయిన్ కంట్రోల్ లోకి కీవ్ 

రష్యా దళాలు నార్త్ నుంచి వెళ్లిపోయాయని ఉక్రెయిన్ మిలిటరీ వెల్లడించింది. బెలారస్‌‌కు దగ్గర్లోని ప్రాంతాల నుంచి సైనికులను రష్యా ఉపసంహరించుకుందని తెలిపింది. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంటుకు అతి దగ్గర్లోని ప్రిప్యత్ పట్టణాన్ని తిరిగి తమ పూర్తి అధీనంలోకి తెచ్చుకున్నట్లు చెప్పింది. ఒక షెల్టర్‌‌‌‌పై ఉక్రెయిన్ జెండాను పెడుతున్న వీడియోను పోస్ట్ చేసింది. మరోవైపు మొత్తం కీవ్‌‌ రీజియన్‌‌ను ఉక్రెయిన్‌‌ తిరిగి అధీనంలోకి తెచ్చుకున్నట్లు డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ గన్నా మాలియర్ తెలిపారు. కీవ్ దగ్గర్లోని కీలక పట్టణాల నుంచి రష్యన్లు వెళ్లిపోయారని చెప్పారు. ఉక్రెయిన్ ప్రతిపాదనలకు రష్యా మౌఖికంగా ఒప్పుకుందని శాంతి చర్చల్లో పాల్గొంటున్న ఉక్రెయిన్  ప్రతినిధి ఒకరు చెప్పారు. యుద్ధం ముగించేందుకు చర్చలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు.

మాస్కోకు యూఎన్ అధికారులు 

రష్యా రాజధాని మాస్కోకు ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారి ఒకరు ఆదివారం వెళ్తారని, తర్వాత ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్‌‌లోనూ పర్యటిస్తారని యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ చెప్పారు. ఉక్రెయిన్‌‌లో కాల్పుల విరమణ పాటించాలని కోరేందుకే ఈ పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. యూఎన్ స్పెషల్ ఎన్వాయ్ మార్టిన్ గ్రిఫిత్స్‌‌ను కలవడానికి రష్యా, ఉక్రెయిన్ అంగీకరించాయని వెల్లడించారు.