
అక్టోబర్‌లో జరిగిన ఆయిల్ దిగుమతుల్లో 22 శాతం వాటా
న్యూఢిల్లీ: దేశానికి క్రూడాయిల్ సప్లయ్ చేస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలను దాటి రష్యా టాప్ పొజిషన్‌కు చేరుకుంది. కిందటి నెలలో రోజుకి 9,35,556 బ్యారెల్స్ ఆయిల్‌ను రష్యా నుంచి ఇండియా దిగుమతి చేసింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి మనం దిగుమతి చేసుకుంటున్న మొత్తం క్రూడాయిల్ దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.1 శాతమే ఉండగా, ప్రస్తుతం ఇది 22 శాతానికి పెరిగింది. 20.5 శాతం ఆయిల్‌ను ఇరాక్ నుంచి దిగుమతి చేసుకుంటుడగా, సౌదీ ఆరేబియా నుంచి 16 శాతం ఆయిల్ వస్తోంది. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు యూఎస్‌తో సహా మరికొన్ని పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో క్రూడాయిల్‌ను చాలా తక్కువ రేటుకే ఇండియాకు అమ్మడానికి రష్యా ముందుకొచ్చింది. డిస్కౌంట్ ఆయిల్ దొరుకుతుండడంతో దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ దేశం నుంచి క్రూడాయిల్‌ను కొనడం పెంచాయి. ఎనర్జీ ఇంటెలిజెన్స్ కంపెనీ వోర్టెక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం, కిందటేడాది డిసెంబర్‌లో రష్యా నుంచి రోజుకి 36,255 బ్యారెళ్ల ఆయిల్ మాత్రమే ఇండియాకు వచ్చేది. అప్పుడు రోజుకి 10.5 లక్షల బ్యారెల్స్ ఇరాక్ నుంచి, రోజుకి 9,52,625 బ్యారెల్స్ సౌదీ ఆరేబియా నుంచి దిగుమతయ్యేవి. ఆ తర్వాత వరస రెండు నెలల్లో కూడా రష్యా నుంచి ఎటువంటి క్రూడాయిల్ దిగుమతులు జరగలేదు. తిరిగి మార్చిలో ఈ దేశం నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ మొదలయ్యాయి. ఈ ఏడాది మార్చిలో రోజుకి 68,600 బ్యారెళ్లను రష్యా నుంచి ఇండియా దిగుమతి చేసుకోగా, ఆ తర్వాతి నెలలో రోజుకి 2,66,617 బ్యారెల్స్‌ను, జూన్‌లో రోజుకి 9,42,694 బ్యారెల్స్‌ను దిగుమతి చేసుకొంది. కానీ, ఈ నెలలో ఇరాక్ నుంచి రోజుకి 10.4 లక్షల బ్యారెల్స్ వచ్చాయి. దీంతో జూన్‌లో ఇరాక్ టాప్ సప్లయర్‌గా నిలిచింది.