మమ్మల్ని రెచ్చగొడితే అణుబాంబులేస్తం

మమ్మల్ని రెచ్చగొడితే అణుబాంబులేస్తం

యూఎన్/బ్రస్సెల్స్: ఉక్రెయిన్​లో మానవతా సంక్షోభానికి రష్యానే కారణమని యునైటెడ్​ నేషన్స్​ జనరల్ అసెంబ్లీ తేల్చిచెప్పింది. గురువారం నాటి అత్యవసర ప్రత్యేక సమావేశంలో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. రష్యా వెంటనే కాల్పుల విరమణ పాటించాలని కోరింది. జనరల్ అసెంబ్లీలో 193 దేశాలు ఉండగా, తీర్మానానికి అనుకూలంగా 140, వ్యతిరేకంగా 5 ఓట్లు వచ్చాయి. ఇండియా సహా 38 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. అంతకుముందు ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభంపై యూఎన్​ భద్రతా మండలిలో రష్యా తీర్మానం వీగిపోయింది. ఒక్క చైనా తప్ప ఏ దేశమూ సపోర్టు చేయలేదు. 15 దేశాల భద్రతా మండలిలో ఇండియా సహా 12 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి.  

రష్యాపై మరిన్ని ఆంక్షలు 
రష్యాపై మరింత కఠిన వైఖరిని అనుసరించాలని నాటో దేశాలు నిర్ణయించాయి. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఇతర ఈయూ దేశాల అధినేతలు పాల్గొన్నారు. రష్యాపై మరిన్ని కొత్త ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నారు. రష్యాకు చెందిన 400 మంది వ్యక్తులు, కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ఆధ్వర్యంలోని జీ7 దేశాలు, ఈయూ ప్రకటించాయి. 

సైనిక సాయం చేయండి: జెలెన్‌స్కీ
ఎలాంటి ఆంక్షలు లేకుండా తమకు సైనిక సాయం చేయాలని నాటోను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. ‘‘మా ప్రజలను, మా నగరాలను కాపాడుకునేందుకు.. మాకు మిలిటరీ సాయం కావాలి. అదీ ఎలాంటి ఆంక్షలు లేకుండా. ఇదే సమయంలో రష్యా రిస్ట్రిక్షన్లను పట్టించుకోకుండా అన్ని ఆయుధాలను మా మీద ఉపయోగిస్తున్నది’’ అని చెప్పారు. నాటో ప్రతినిధులతో గురువారం వీడియో లింక్‌ ద్వారా ఆయన మాట్లాడారు. రక్షణ పరికరాలను అందించినందుకు కృతజ్ఞతలు చెప్పిన జెలెన్‌స్కీ.. ఎదురుదాడులు చేసేందుకు ఆయుధాలు ఇవ్వాలని కోరారు. ‘‘మీ దగ్గర ఉన్న మొత్తం విమానాల్లో.. మీ దగ్గర ఉన్న మొత్తం ట్యాంకుల్లో ఒక్క శాతం మాకు ఇవ్వండి.. ఒకే ఒక్క శాతం” అని కోరారు. రష్యా తమపై పాస్పరస్ ఆయుధాలను ప్రయోగిస్తున్నదని చెప్పారు. ఈ ఉదయం కూడా తమపై ఆ బాంబులను వేసిందన్నారు.

రష్యా కెమికల్ దాడి చేయొచ్చు: నాటో చీఫ్
ఉక్రెయిన్ లో కెమికల్ వెపన్స్ ప్రయోగించేందుకు రష్యా సాకును సిద్ధం చేసుకుంటోందని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ అన్నారు. గురువారం నాటో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికా, నాటో దేశాలతో కలిసి ఉక్రెయిన్ బయాలజికల్ వెపన్స్ తయారు చేస్తోందంటూ సాకును చూపి.. 
ఉక్రెయిన్​లో కెమికల్ వెపన్స్​ను ప్రయోగించాలని రష్యా యోచిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కెమికల్ దాడులు చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్ పై దాడి చేయడం రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన పెద్ద తప్పు అని అన్నారు.

నాటో రెచ్చగొడితే అణుబాంబులేస్తం: రష్యా
నాటో కనుక రెచ్చగొడితే అణు ఆయుధాలు ఉపయోగించే హక్కు రష్యాకు ఉందని యూఎన్​లో రష్యా డిప్యూటీ అంబాసిడర్ దిమిత్రీ పోల్యన్‌స్కీ హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందన్న ఆరోపణలను ఖండించారు. అంతకుముందు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మాట్లాడుతూ.. తమకు అస్తిత్వ ముప్పు ఏర్పడినప్పుడే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని చెప్పారు.