ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ అటాక్ నలుగురు మృతి.. 20 మందికి గాయాలు

ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ అటాక్ నలుగురు మృతి.. 20 మందికి గాయాలు
  • పలు బిల్డింగులు ధ్వంసం
  •     మనం కూడా ఎయిర్ డిఫెన్స్  తయారు చేస్కోవాలి: జెలెన్ స్కీ

కీవ్: ఉక్రెయిన్ పై రష్యా బాలిస్టిక్  మిసైళ్లు, డ్రోన్లతో దాడి చేసింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ అటాక్  చేసింది. ఈ దాడిలో రాజధాని కీవ్ లో ఇద్దరు చనిపోగా.. 13 మంది గాయపడ్డారు. అలాగే, నిప్రోపెట్రోవ్స్ క్  రీజియన్ లో మరో ఇద్దరు చనిపోగా ఏడుగురు గాయపడ్డారు. దాడిలో పలు బిల్డింగులు కూడా ధ్వంసమయ్యాయి. కీవ్ లోని ఓ నాన్ రెసిడెన్షియల్  బిల్డింగ్ కు మంటలు అంటుకున్నాయి. కీవ్ లోనే మరో చోట మిసైల్  ధాటికి ఓ భవనం శకలాలు ఎగిరి సమీపంలోని బిల్డింగుల మీద పడ్డాయి. 

దీంతో ఆ భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. రష్యా దాడితో కీవ్ లో మంటలు అంటుకున్నాయని, సిటీ బాలిస్టిక్  అటాక్ లో ఉందని మేయర్  విటాలి క్లిచ్ స్కో.. టెలిగ్రాంలో తెలిపారు. ఇక నిప్రోపెట్రోవ్స్ క్  ప్రాంతంలో రష్యా దాడిలో పలు బిల్డింగులు, ప్రైవేట్ హోమ్స్  దెబ్బతిన్నాయని తాత్కాలిక గవర్నర్ లాడిస్లా హైవనెంకో చెప్పారు. రష్యా 9 మిసైళ్లు, 62 డ్రోన్లను ప్రయోగించగా తాము 4 మిసైళ్లు, 50 డ్రోన్లను కూల్చేశామని ఉక్రెయిన్  అధికారులు తెలిపారు. 

రష్యా భూతం నుంచి కాపాడుకోవాలి

రష్యా దాడిపై ఉక్రెయిన్  ప్రెసిడెంట్  వోలోదిమిర్  జెలెన్ స్కీ కూడా స్పందించారు. శత్రువు రోజురోజుకు రెచ్చిపోతున్నాడని, తాము కూడా ఎయిర్ డిఫెన్స్  సిస్టంను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘‘రష్యా భూతం నుంచి మన సిటీలను కాపాడుకోవాలి. దీనికి బలమైన ఎయిర్ డిఫెన్స్​ను అభివృద్ధి చేసుకోవాలి. ఈ విషయమై ఇటీవలే మిత్ర దేశాలతో మాట్లాడాను. అందుకు మిత్ర దేశాలు సహకరించాలి. 

మాపై రష్యా ముందుముందు దాడులు చేయకుండా అమెరికా, యూరప్, జీ7 దేశాలు చూడాలి. మా పౌరుల ప్రాణాలకు భరోసా దక్కేలా చూడాలి. యూఎస్ నుంచి 25 ఎయిర్ డిఫెన్స్  కొంటాం” అని జెలెన్ స్కీ వ్యాఖ్యానించారు. కాగా.. ఉక్రెయిన్ కూడా శుక్రవారం అర్ధరాత్రి తమపై దాడికి ప్రయత్నించిందని, అది ప్రయోగించిన 121 డ్రోన్లను కూల్చేశామని రష్యా తెలిపింది.