సుఖోయ్ 57ను తయారుచేద్దాం..భారత్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆఫర్

సుఖోయ్ 57ను తయారుచేద్దాం..భారత్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆఫర్
  • గతంలోనూ ఆఫర్.. తిరస్కరించిన భారత్ 
  • ఇప్పుడు ఈ ప్రాజెక్టులో చేరాలని మరోసారి ఆహ్వానం 

మాస్కో:  అధునాతన సుఖోయ్-57 స్టెల్త్ ఫైటర్ జెట్ ను ఉమ్మడిగా ఉత్పత్తి చేద్దామంటూ భారత్ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆఫర్ ఇచ్చారు. గురువారం మాస్కోలో అంతర్జాతీయ వార్తా సంస్థలతో పుతిన్ మాట్లాడుతూ.. మెరుగైన స్టెల్త్ సామర్థ్యాలు కలిగిన సుఖోయ్-57 విమానాన్ని భారతదేశంతో కలిసి ఉమ్మడిగా అభివృద్ధి చేయడానికి, ఉత్పత్తి చేయడానికి రష్యా సుముఖంగా ఉందని, కీలకమైన సాంకేతికతలను పంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పారు.

 ‘‘భారతదేశానికి ఈ విమానాన్ని సరఫరా చేయడానికి, దీనిని మరింత అభివృద్ధి చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మాకు ఎటువంటి సమస్యలు లేదా పరిమితులు లేవు. వైమానిక రక్షణ వ్యవస్థల (ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్) విషయంలోనూ ఇదే వర్తిస్తుంది”అని ఆయన తెలిపారు. రష్యా 2018లో కూడా భారతదేశానికి సుఖోయ్-57 యుద్ధ విమానాన్ని ఉమ్మడిగా అభివృద్ధి చేసే అవకాశాన్ని ఆఫర్ చేసిందని పుతిన్ గుర్తుచేశారు. అప్పట్లో దీనిని ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ (ఎఫ్ జీఎఫ్ఏ) ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌గా పిలిచేవారు. అయితే, రష్యా సొంతంగా ఈ ప్రాజెక్టుపై ముందుకు సాగాలని, ఆపై తాము ప్రాజెక్టులో చేరతామని అప్పట్లో భారత్ చెప్పిందన్నారు. 

‘‘భారత్ అప్పుడు అంగీకరించి ఉంటే, ఈ విమానం మన ఉమ్మడి ప్రాజెక్ట్ అయి ఉండేది. మేం దీనిని స్వతంత్రంగా నిర్మించాం. ఈ రంగంలో భారత్ తో కలిసి పనిచేయడానికి మేం ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన వెల్లడించారు. కాగా, ఐఏఎఫ్ అమ్ములపొదిలో ప్రస్తుతం ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ లు లేవు. మరోవైపు పాకిస్తాన్ త్వరలోనే చైనా నుంచి షెన్యాంగ్ జె-35ఏఈ స్టెల్త్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయబోతోందనే ఊహాగానాలు ఆందోళనలను రేకెత్తించాయి. 

భారత్ స్వదేశీ 5వ తరం యుద్ధవిమానం తయారీకి చేపట్టిన ఏఎంసీఏ ప్రాజెక్టు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఈ ఫైటర్ జెట్ 2030ల మధ్య కాలంలో మాత్రమే సేవల్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో, ఈ లోటును పూడ్చడానికి ఐఏఎఫ్ ఒక 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం కోసం వెతుకుతుండగా, పుతిన్ ఆఫర్ అద్భుతమైన అవకాశంగా కనిపిస్తోంది. పుతిన్ ఆఫర్ పై భారత్ అధికారికంగా ఇంకా స్పందించలేదు.