మహిళా క్రికెటర్‌ను పెళ్లాడబోతున్న రుతురాజ్ గైక్వాడ్

మహిళా క్రికెటర్‌ను పెళ్లాడబోతున్న రుతురాజ్ గైక్వాడ్

భారత యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తన ప్రేయసి ఉత్కర్ష పవార్‌ను మనువాడనున్నాడు. జూన్ 2,3 తేదీలలో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉత్కర్ష పవార్ కూడా క్రికెటరే. పూణేకు చెందిన ఆమె, మహారాష్ట్ర తరుపున దేశవాళీ క్రికెటర్‌గా రాణిస్తోంది. కుడి చేతి బ్యాటర్ అయిన ఉత్కర్ష, బౌలింగ్‌లోనూ  మెప్పిస్తూ ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది.

ఉత్కర్ష స్వస్థలం.. పూణే. అక్టోబర్ 13, 1998న జన్మించింది. ఆమె11 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ ఆడుతోంది. చివరిసారిగా 18 నెలల క్రితం నవంబర్ 15, 2021న సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆడింది. ఇక ఉత్కర్ష చదువు విషయానికొస్తే.. ఆమె పూణేలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్‌నెస్ సైన్స్‌లో విద్యను అభ్యసిస్తోంది.  

గైక్వాడ్ పెళ్లి కారణంగానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌ని రిజర్వ్ ఓపెనర్ గా ఎంపిక చేశారు. ఇక ఈ సీజన్‌లో 590 పరుగులు చేసి రుతురాజ్ చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో విజయం అనంతరం గైక్వాడ్ తమ కెప్టెన్ ధోనీతో కలిసి ఓ ఫొటో దిగాడు. అందులో ఐపీఎల్ ట్రోఫీతో పాటు తనకు కాబోయే సతీమణి ఉత్కర్ష పవార్ కూడా ఉంది. త్వరలో స్వదేశంలో జరగబోయే అఫ్ఘాన్, ఐర్లాండ్ సిరీస్‌లలో రుతురాజ్ కనిపించనున్నాడు.