చిట్ట చివరి రైతు వరకు అందరికీ రైతుబంధు సాయం

చిట్ట చివరి రైతు వరకు అందరికీ రైతుబంధు సాయం

రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్ట చివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలన్నారు సీఎం కేసీఆర్. దీనికి సంబంధించి అధికారులను ఆదేశించారు. రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై శనివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం.

ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వందకు వందశాతం నియంత్రిత పద్ధతిలో ఈ వానాకాలం పంట సాగు చేస్తుండడం శుభసూచకమన్నారు సీఎం కేసీఆర్. ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అని తెలిపారు. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు రూ.25 కోట్ల వ్యయంతో అతి పెద్ద అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజిని నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

అంతేకాదు కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశ్యంతో రైతుబంధు సాయం విడుదల చేసిందని తెలిపారు కేసీఆర్. అధికారులు ఎంతో సమన్వయంతో వ్యవహరించి రైతులందరికీ సకాలంలో రైతుబంధు సాయం అందించారన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 99.9 శాతం మంది రైతులకు రైతుబంధు సాయం అందిందని చెప్పారు. ఇంకా ఎవరైనా రైతులు మిగిలిపోయినా, వెంటనే వారిని గుర్తించి సాయం అందించాలి. ఏ ఒక్కరూ మిగలకుండా చిట్ట చివరి రైతు వరకు రైతుబంధు సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు తమ జిల్లాలో, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలను వెంటనే తెలుసుకుని, అందరికీ డబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. కాస్తులో ఉన్నప్పటికీ కొంత మంది రైతులకు యాజమాన్య హక్కుల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉండడం వల్ల రైతుబంధు సాయం అందడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నారు. అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించి.. సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. యాజమాన్య హక్కు గుర్తించడానికి మోకా మైనా (స్పాట్ ఎంక్వైరీ) నిర్వహించాలన్నారు. చుట్టుపక్కల రైతులను విచారించి యాజమాన్య హక్కులు కల్పించాలని… అందరి సమస్యలు పరిష్కరించి, అందరికీ సాయం అందించాలని తెలిపారు. ఈ విషయంలో రైతుబంధు సమితుల, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. ఒక సారి పరిష్కారం అయిపోతే, ఎప్పటికీ గొడవ ఉండదని… అది అన్ని తీర్లా మంచిదని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామానికి అసలు రెవెన్యూ రికార్డే లేదని… ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి చొరవ కారణంగా ప్రభుత్వం మొత్తం గ్రామంలో సర్వే జరిపిందని గుర్తు చేశారు. ఏ భూమికి ఎవరు యజమానో నిర్ధారించడం జరిగిందన్నారు. మిగతా చోట్ల కూడా అదే విధంగా జరగాలన్నారు.

 రైతులందరికీ రైతుబంధు

రైతులందరికీ రైతుబంధు సాయం అందించడానికి ఎంత వ్యయం అయినా ప్రభుత్వం వెనుకాడబోదన్నారు. రైతుబంధు సాయం అందించడానికి టైమ్ లిమిట్ లేదన్నారు. చివరి రైతుకు సాయం అందే వరకు విశ్రమించవద్దని సూచించారు. వందకు వంద శాతం రైతులందరికీ సాయం అందడమే ప్రభుత్వ లక్ష్యమని.. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా తనకు రైతుబంధు సాయం అందలేదని అనవద్దని స్పష్టం చేశారు.

రైతుబంధు సాయం ఎంత మందికి అందింది? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలపై వెంటనే నివేదిక సమర్పించాలన్నారు. క్లస్టర్ల వారీగా ఎంఇవోల నుంచి నివేదికలు తెప్పించాలన్నారు. రైతుబంధు సమితుల ద్వారా కూడా వివరాలు తెప్పించాలని చెప్పారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి వెంటనే సాయం అందించాలన్నారు. భూముల క్రయ విక్రయాలు జరిగితే ఆ వివరాలను కూడా వెంటనే నమోదు చేయాలని సీఎం ఆదేశించారు.

రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని సూచించిందన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకే వానాకాలం పంటల సాగు చేస్తున్నారన్నారు. మక్కల సాగు వద్దంటే ఎవరూ వేయలేదని.. ఇది గొప్ప పరివర్తన అని అన్నారు. నియంత్రిత సాగు పద్ధతి వందకు వంద శాతం విజయవంతం కావడం గొప్ప పరిణామం అని తెలిపారు. రైతుల్లోని ఈ  ఐక్యత, చైతన్యం భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది పలికింది. ఇది శుభసూచకమన్నారు.

దసరాలోగా రైతు వేదికల నిర్మాణం

రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయాధికారులతో సమావేశం కావడానికి దేశంలో మరెక్కడా లేని రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దసరాలోగా ఈ వేదికల నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపించాలన్నారు. ఒకసారి రైతువేదికల నిర్మాణం పూర్తయితే, అవే రైతులకు రక్షణ వేదికలు అవుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్యవసాయిక రాష్ట్రంగా రూపాంతరం చెందుతోందన్నారు సీఎం. అందులో భాగంగా పెద్ద ఎత్తున విత్తన ఉత్పత్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రైతులకు అవసరమైన మేలు రకమైన, నాణ్యమైన విత్తనాల తయారీని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టాయి. అలా తయారు చేసిన విత్తనాలను నిల్వ ఉంచడానికి రూ.25 కోట్ల వ్యయంతో అతి భారీ అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనికి కావాల్సిన నిధులను కూడా వెంటనే విడుదల అవుతాయని తెలిపారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తేవాలన్నారు సీఎం కేసీఆర్.