తెలంగాణలో అమల్లోకి 2025-26 రైతు బీమా పథకం.. ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే..

తెలంగాణలో అమల్లోకి 2025-26 రైతు బీమా పథకం.. ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే..
  • లబ్ధిదారుల్లో టాప్​లో నల్గొండ
  • నిరుడు 25 వేలకు పైగా​ క్లెయిమ్స్
  • రూ.1300 కోట్ల దాకా అందిన పరిహారం
  • కొత్త బీమా ఏడాది ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో2025–-26 రైతు బీమా పథకం అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 42,16,848 మంది రైతులకు  ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించింది. నిరుటి కన్నా ఈసారి 1,181 మందిని అదనంగా ఈ పథకంలో చేర్చింది. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. 2025–-26 బీమా సంవత్సరానికి ఆగస్టు 14 నుంచి కొత్త సీజన్ మొదలైంది. ఈ ఏడాది జూన్ 5 వరకు కొత్తగా పట్టాదారు పాస్‌బుక్‌లు పొందిన 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల రైతులు ఈ పథకానికి అర్హులు.

ఆగస్టు 13 వరకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. 1,96,890 మంది కొత్త రైతులను ఈ పథకంలో చేర్చారు. అలాగే, గతంలో బీమా కలిగి ఉన్న 40,19,958 మంది రైతుల బీమాను రెన్యువల్  చేశారు. దీంతో మొత్తం 42.16 లక్షల మంది రైతులకు 2026 ఆగస్టు 14 వరకు బీమా కవరేజీ కొనసాగనుంది. కాగా.. వ్యవసాయ శాఖ అధికారుల చర్చలతో ఈ ఏడాది బీమా ప్రీమియంను గతంలో కంటే తగ్గించారు. గత ఏడాది రూ.3,400గా ఉన్న ప్రీమియం ఈ ఏడాది రూ.3,225కు తగ్గింది. ఇక 2024–--25 బీమా సంవత్సరంలో 25 వేలకు పైగా క్లెయిమ్‌లు నమోదయ్యాయి. ఒక్కో క్లెయిమ్‌కు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.1,300 కోట్లకు పైగా పరిహారం రైతు కుటుంబాలకు అందినట్లు సమాచారం. 

రైతుబీమా లబ్ధిదారుల్లో టాప్​లో నల్గొండ

రాష్ట్రంలో రైతుబీమా అర్హత సాధించిన రైతుల్లో నల్గొండ టాప్​లో ఉంది. ఈ జిల్లాలో అత్యధికంగా 2,98,037 మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించారు. కొత్తగా 12,212 మంది రైతులకు బీమా కల్పించగా.. 2,85,825 మంది రైతులకు రెన్యువల్​ చేశారు. తరువాత సంగారెడ్డి జిల్లాలో 2,12,335 మంది రైతులకు రైతుబీమా సౌకర్యం కల్పించారు. ఖమ్మం జిల్లాలో 2,04,951 రైతులకు బీమా అవకాశం దక్కడంతో మూడో స్థానంలో నిలిచింది. కామారెడ్డి జిల్లాలో 1,98,241, నాగర్​ కర్నూల్​ జిల్లాలో 1,90,945 మంది రైతులకు బీమా కల్పించారు. మేడ్చల్​ జిల్లాలో అత్యల్పంగా 14,310 మంది రైతులకు రైతుబీమా కల్పించారు.