జనవరి నెలాఖరు కల్లా రైతులందరికీ రైతుబంధు

జనవరి నెలాఖరు కల్లా రైతులందరికీ రైతుబంధు
  • ఇప్పటికే 30 లక్షల మందికి వేశాం: తుమ్మల
  • బీఆర్ఎస్ తప్పులు బయటపడతాయనే ఫైళ్లు మాయం చేసేందుకు ప్రయత్నం: పొంగులేటి


కూసుమంచి, వెలుగు: ఈ నెలాఖరుకల్లా రైతులందరికీ రైతుబంధు డబ్బులు జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేశామని చెప్పారు. మిగిలినోళ్లకు సంక్రాంతిలోపు గానీ, ఆ తర్వాత గానీ వేస్తామని వెల్లడించారు. బుధవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తుమ్మల మీడియాతో మాట్లాడారు.

పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఖమ్మం, పాలేరుకు తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ముగ్గురు మంత్రులం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మాటలు చెప్పుడు తప్ప, పనులు చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారని కొనియాడారు. 

తప్పు చేయకపోతే ఫైళ్ల మాయం ఎందుకు? 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు బయటపడతాయనే, ఫైళ్లను మాయం చేసేందుకు ప్రయత్నించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వాళ్లు తప్పు చేయకపోతే ఫైళ్లను మాయం చేయాలని ఎందుకు చూశారని ప్రశ్నించారు. ‘‘గత ప్రభుత్వంలో చేసిన తప్పులు బయటపడతాయని ఫైళ్లను మాయం చేసే కార్యక్రమం చేపడితే, ఆ ఫైళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వాళ్ల తొత్తులకు ప్రభుత్వ ఆస్తులను బీఆర్ఎస్ కట్టబెట్టింది.

ఇప్పటికే ఖమ్మంలో రెండు, మూడు అంశాలను కలెక్టర్ బయటకుతీశారు. ప్రభుత్వ ఆస్తులు ప్రజలకు చెందే విధంగా చర్యలు తీసుకుంటం” అని చెప్పారు. ‘‘డబ్బు అహంకారంతో ఉన్నోళ్లను గెలిపించవద్దని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అన్నారు. కానీ ప్రజలు వివేకంతో ఆలోచించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. అంతే తప్ప.. పొంగులేటి డబ్బులు కుమ్మరిస్తే గెలవలేదు. నాపైన ఉన్న ప్రేమతోనే ప్రజలు నన్ను గెలిపించారు. మేం ప్రజలకు సేవకులుగా పని చేస్తున్నామే తప్ప, పాలకులుగా కాదు” అని అన్నారు. 

మిర్చి కొనుగోళ్లు.. సజావుగా జరిగేలా చూడాలి

మిర్చి కొనుగోళ్లు, అమ్మకాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌‌ శాఖ అధికారులను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావు ఆదేశించారు. కొన్ని రోజులుగా మిర్చి ధరలు తగ్గుతూ రావడం, మార్కెట్ యార్డుల్లో రైతుల ఆందోళనల నేపథ్యంలో మంత్రి బుధవారం మార్కెటింగ్‌‌ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్చి ధర తగ్గడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డుల్లో గొడవలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రశాంతంగా మిర్చి కొనుగోళ్లు, అమ్మకాలు జరిగేలా చూడాలన్నారు. అడ్తిదారులు, కొనుగోలుదారులతో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. మైకుల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. దగ్గర్లో ఉన్న కోల్డ్ స్టోరేజీల్లో పంట నిల్వ చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రివ్యూ మీటింగ్​లో మార్కెటింగ్‌‌ శాఖ డైరెక్టర్‌‌ లక్ష్మిబాయి, అడిషనల్‌‌ డైరెక్టర్‌‌ పి.రవి కుమార్, జాయింట్ డైరెక్టర్‌‌ శ్రీనివాస్, వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్‌‌  అజ్మీరా రాజు తదితరులు పాల్గొన్నారు.