స్పీడ్ల సుప్రీమ్: గంటకు 360 కిలోమీటర్ల వేగం

స్పీడ్ల సుప్రీమ్: గంటకు 360 కిలోమీటర్ల వేగం

గంటకు 360 కిలోమీటర్ల వేగాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అది పట్టాలపై పరుగుపెడుతున్నప్పుడు మనం పక్కనుంటే ఆ స్పీడ్​కు ఎగిరిపోయినా ఎగిరిపోతాం. ఈ స్పీడ్​ జపాన్​ కొత్తగా తయారు చేసిన బుల్లెట్​ రైలు ఎన్​700ఎస్​ది. ఎస్​ అంటే ‘సుప్రీమ్​’ అని అర్థం. దాని పేరుకు తగ్గట్టే స్పీడ్​లోనూ సుప్రీమ్​ అయిపోయిందా బుల్లెట్​ రైలు. టోక్యో ఒలింపిక్స్​ నాటికి దానిని పట్టాలపైకి ఎక్కించాలని భావిస్తున్న జపాన్​, శుక్రవారం పట్టాలపై టెస్టు చేసింది. ఆ టెస్ట్​ రన్​లో 360 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని రికార్డు సృష్టించింది. మైబారా–క్యోటో లైన్​లో దీనిని పరీక్షించారు.

షింకాన్సెన్​ బుల్లెట్​ రైళ్లలో ఇదీ ఓ వెర్షన్​. ఇప్పుడున్న డిజైన్లతో పోలిస్తే దీని డిజైన్​ స్పెషల్​ అని, ఇప్పటి బుల్లెట్ ట్రైన్ల కన్నా తేలికగా ఉంటుందని, ఎక్కువ స్పీడ్​తో దూసుకెళ్లినా, తక్కువ ఇంధనాన్ని వాడుకుంటుందని దీనిని తయారు చేసిన సెంట్రల్​ జపాన్​ రైల్వే కంపెనీ అలియాస్​ జేఆర్​ సెంట్రల్​ చెప్పింది. భూకంపాలొచ్చినా తట్టుకునేలా భద్రతా ఫీచర్లు అందులో ఉన్నాయంది.

షింకాన్సెన్​ ప్రాజెక్టులో భాగంగా కంపెనీ సుమారు ₹15,260 కోట్లు (220 కోట్ల డాలర్లు) ఖర్చు చేస్తోంది. జూన్​ వరకు ట్రైన్​ స్పీడ్​పై కంపెనీ టెస్టులు చేస్తుంది. జేఆర్​ సెంట్రల్  టెస్ట్​ చేస్తున్న ఇంకో బుల్లెట్​ ట్రైన్​ ఆల్ఫా ఎక్స్​ కూడా 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. దానిని 2030 నాటికి పట్టాలెక్కించేందుకు జపాన్‌‌ సెంట్రల్‌‌ రైల్వే కృషి చేస్తోంది.  టోక్యో నుంచి హొక్కైడో మధ్య అది సేవలందిస్తుంది.