
కేరళ శబరిమల అయ్యప్ప దేవాలయానికి ఈ ఏడాది భారీగా ఆదాయం చేరింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 18 కోట్లు పెరిగిందని ట్రావెల్‌కోర్ బోర్డు తెలిపింది.
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల దేవాలయానికి ప్రతి ఏటా భక్తుల తాకిడి పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే.. ఈ ఏడాది యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సీజన్‌లో డిసెంబర్ 25 వరకు 31,43,163 మంది శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. దాంతో ఆలయ ఆదాయం కూడా పెరిగింది. శబరిమల ఆలయ ఆదాయం ఈ సీజన్లో రూ. 200 కోట్లు దాటింది.
మండల పూజ వేళ శబరిమల అయప్ప స్వామి ఆలయానికి 241.71 కోట్ల ఆదాయం(Sabarimala Revenue) వచ్చింది.39 రోజుల్లో ఆ ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. గత ఏడాది సీజన్‌తో పోలిస్తే ఈసారి 18.72 కోట్లు అధికంగా వచ్చినట్లు ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. గత ఏడాది 222.98 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. 39 రోజుల్లోనే ఆలయ ఆదాయం 200 కోట్లు దాటినట్లు ఆయన వెల్లడించారు. వేలం ద్వారా 37.40 కోట్లు వచ్చినట్లు ప్రశాంత్ తెలిపారు. కానుకల రూపంలో వచ్చిన నాణాలను, నీలక్కల్ వద్ద పార్కింగ్ ఫీజులను లెక్కిస్తే ఆ మొత్తం ఆదాయం మరింత పెరుగుతుందని ఆయన తెలిపారు.
ఇక నగదు కానుకల రూపంలో 63.89 కోట్లు రాగా, అరవన ప్రసాదం ద్వారా 96.32 కోట్లు, అప్పం స్వీటు ద్వారా 12.38 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. బుధవారం ( డిసెంబర్ 27) కూడా అధిక సంఖ్యలో అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. బుధవారం ( డిసెంబర్ 27)రాత్రి ఆలయాన్ని మూసివేశారు. మూడు రోజుల తర్వాత అంటే డిసెంబర్ 30వ తేదీన తిరిగి ఆలయాన్ని తెరవనున్నారు. జనవరి 15వ తేదీన జరిగే మకరవిలక్కు పండుగ వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు.