శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో ట్విస్ట్.. స్పాన్సర్ పెళ్లికి ఆ బంగారం వాడారా..? షాకింగ్ విషయాలు వెలుగులోకి

శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో ట్విస్ట్.. స్పాన్సర్ పెళ్లికి ఆ బంగారం వాడారా..?  షాకింగ్ విషయాలు వెలుగులోకి

శబరిమలలో అయ్యప్పస్వామి ఆలయంలో గోల్డ్​మాయం వివాదం ముదురుతోంది. దీనిపై ఇప్పటికే రాజకీయంగా దుమారం రేగుతోంది. బంగారం మాయం కేసులో స్పాన్సరే కీలక సూత్రధారి, పాత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. ద్వార పాలకుల విగ్రహాలపై పూత విక్రయించబడి, నిధులు దుర్వినియోగం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కోర్టు కూడా పలు సందేహాలు వ్యక్తం చేసింది.

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారం మాయం కావడంతో భారీ కుంభ కోణం జరిగిందని.. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కేరళ హైకోర్టు.. బంగారం మాయం కావడంపై పలు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. 

2019లో ఇప్పటికే బంగారు పూత పూసిన ద్వారపాలక విగ్రహాలకు బంగారు పూత పూయడానికి స్పాన్సర్ చేసిన ఉన్నికృష్ణన్ పొట్టి..2019 బంగారు పూత పూసిన తర్వాత తన వద్ద ఉన్న మిగిలిన బంగారాన్ని పెళ్లికి ఉపయోగించాలనే కోరికను వ్యక్తం చేశారని కోర్టు పేర్కొంది.

ఈ విషయంపై ADGP (క్రైమ్) నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కేరళ కోర్టు డిబిజన్​ బెంచ్​ ఆదేశించింది. కేసు విచారణ సమయంలో అసలు బంగారు పూత పూసిన ద్వారపాలకుల విగ్రహాలపై బంగారాన్ని  విక్రయించి, దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని దుర్వినియోగం చేశారని తెలిపింది. 

గత నెలలో శబరిమల ఆలయంలోని ద్వారపాలక విగ్రహాలను తొలగించి బంగారు పూత కోసం చెన్నైకి తీసుకెళ్లారు నిర్వాహకులు. అయితే కోర్టు ముందస్తు అనుమతి లేకుండానే వాటిని తొలగించారని ఆరోపణలు రావడంతో హైకోర్టు సుమోటోగా విచారణ ప్రారంభించింది. ఆలయంలోని అన్ని విలువైన వస్తువుల లిస్టును తయారు చేసేందుకు మాజీ న్యాయమూర్తి కె.టి. శంకరన్‌ను నియమించింది కోర్టు. ఆలయంలోని జరిగిన అవతవకలపై దర్యాప్తు చేసి నిజాలను బయటపెట్టాలని ఆలయ విజిలెన్స్ అధికారిని కోరింది.

విజిలెన్స్ అధికారి తాజా రిపోర్టు పరిశీలించిన తర్వాత సోమవారం ఈ కేసులో మోసాలకు పాల్పడినట్లు కోర్టు తెలిపింది. దోషులను పట్టుకునేందుకు సమగ్ర దర్యాప్తు అవసరమని కోర్టు తెలిపింది. మరోసారి మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు.. శబరిమల ఆలయంలో  బంగారం మాయం కేసులో స్పాన్సర్​ ఉన్నికిష్ణన్ పాత్ర ఉన్నట్లు కోర్టు తెలిపింది. విగ్రహాలపై బంగారాన్ని విక్రయించి వచ్చిన నిధులను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొంది.