అశోక్‌‌ గెహ్లాట్‌‌ సర్కారుకు సచిన్ పైలట్ అల్టిమేటం

అశోక్‌‌ గెహ్లాట్‌‌ సర్కారుకు సచిన్ పైలట్ అల్టిమేటం
  • నెలఖారు దాకా గడువిస్తున్నా..
  • అవినీతిపై చర్యలు తీస్కోకుంటే రాష్ట్రమంతటా ఆందోళన
  • అశోక్‌‌ గెహ్లాట్‌‌ సర్కారుకు సచిన్ పైలట్ అల్టిమేటం

జైపూర్‌‌‌‌: రాజస్థాన్‌‌లో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచూ వ్యాఖ్యలు చేస్తున్న మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్.. తాజాగా స్వరం పెంచారు. గత ప్రభుత్వ అవినీతిపై ఈ నెలాఖరులోగా చర్యలు తీసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అజ్మీర్ నుంచి జైపూర్ దాకా చేపట్టిన జన్ సంఘర్ష్ యాత్ర పూర్తయిన నేపథ్యంలో సోమవారం సభ నిర్వహించారు. ఈ మీటింగ్‌‌లో 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైలట్‌‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ అవినీతిపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఆర్‌‌‌‌పీఎస్సీ)లో సమూల మార్పులు చేయాలని, పేపర్‌‌‌‌ లీక్‌‌ల కారణంగా ఉద్యోగ నియామక పరీక్షలు రద్దు కావడంతో నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘‘ఇప్పటికే నిరాహార దీక్ష, యాత్ర చేపట్టాను. ఈ మూడు డిమాండ్లపై ఈనెలాఖరులోగా చర్యలు తీసుకోకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభిస్తా” అని హెచ్చరించారు. ప్రజలతో కలిసి గ్రామాల్లో నడుస్తామని, వారికి న్యాయం జరిగేలా చేస్తామని, భయపడబోమని స్పష్టం చేశారు.
చివరి శ్వాస దాకా ప్రజలకు సేవ చేస్త 
‘‘నేను ఏ పదవిలో ఉన్నా, లేకున్నా..  నా చివరి శ్వాస దాకా రాజస్థాన్ ప్రజలకు సేవ చేస్తానని మాటిస్తున్నా. ఏదీ నన్ను భయపెట్టబోదు, అణచివేయలేదు. నేను మీ కోసం పోరాడాను. పోరాడుతాను” అని పైలట్ చెప్పారు. తన ఆందోళన ఏ ఒక్కరికో వ్యతిరేకం కాదని చెప్పారు. యువత కోసం తాను పోరాటం చేస్తున్నానని చెప్పారు. ‘‘మమ్మల్ని తిడుతున్నా.. మేం ప్రజల్లోనే ఉంటున్నాం. కాంగ్రెస్‌‌ను బలోపేతం చేయడం కోసం పనిచేశాం. మీరేమో మమ్మల్ని అపఖ్యాతిపాలు చేస్తున్నారు” అని పరోక్షంగా గెహ్లాట్‌‌ను విమర్శించారు. వసుంధర రాజే తన ప్రభుత్వాన్ని కాపాడారంటూ అశోక్ గెహ్లాట్‌‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘మీరు మీ సొంత పార్టీ నాయకుల ప్రతిష్టను దిగజార్చడం, ఇతరులను ప్రశంసించడం ఎలాంటి విధానం” అని నిలదీశారు. ‘‘నేనెప్పుడూ ఎవరిపైనా ఆరోపణలు చేయలేదు. ఎవరిపైనా చెడు మాటలు మాట్లాడలేదు. వారు నన్ను దుర్భాషలాడే అవకాశం ఇవ్వలేదు” అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీస్సులే ముఖ్యమని అన్నారు.