MI vs CSK: ధోనీ సిక్సర్ల వర్షం.. ఆనందంతో గంతులేసిన సారా టెండూల్కర్

MI vs CSK: ధోనీ సిక్సర్ల వర్షం.. ఆనందంతో గంతులేసిన సారా టెండూల్కర్

ముంబైలోని వాంఖడే స్టేడియానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. శ్రీలంకతో 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు వరల్డ్ కప్ అందించాడు. సిక్సర్ తో మ్యాచ్ ను ఫినిష్ చేసిన విధానం ప్రతి ఒక్క భారతీయుడి కళ్ళముందు మెదిలాడుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ లో మరోసారి మహేంద్రుడు ముంబైలో తన ప్రతాపం చూపించాడు. ఆడింది నాలుగు బంతులైనా 20 పరుగులు చేసి జట్టు స్కోర్ 200 పరుగులకు చేర్చాడు.

ఐపీఎల్ లో భాగంగా నిన్న (ఏప్రిల్ 14) ముంబైలోని వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ చివరి ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చాడు. ఆడేది ముంబైలోనైనా స్టేడియం అంతా ఎల్లో జెండాలతో నిండిపోయింది. ప్రతి ఒక్కరు ధోనీ ఆడిన క్యామియోను ఎంజాయ్ చేశారు. ఈ ఫ్యాన్స్ లో సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా ఉండడం విశేషం. ముంబైకి సపోర్ట్ చేయడానికి వచ్చిన ఈమె ధోనీ కొడుతున్న సిక్సర్లకు కేరింతలు కొట్టింది. కుర్చీలో నుంచి లేచి క్లాప్స్ కొడుతూ మహేంద్రుడిపై తన అభిమానాన్ని చాటుకుంది. 

మ్యాచ్ అనంతరం ఇంస్టాగ్రామ్ వేదికగా ధోనీ గ్రౌండ్ లోకి వచ్చిన చిత్రాన్ని పోస్ట్ చేయడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. చివరి నాలుగు బంతులను మాత్రమే ఆడిన ధోనీ వరుసగా 6,6,6, 2 కొట్టి ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో తొలుత సీఎస్కే 20 ఓవర్లలో 206/4 స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (40 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69), శివం దూబే (38 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 నాటౌట్‌‌ ) ఫిఫ్టీలకు తోడు ధోనీ (4 బాల్స్‌‌లో 3 సిక్సర్లతో 20 నాటౌట్‌‌) సూపర్‌‌‌‌ ఫినిషింగ్ ఇచ్చాడు. ఛేజింగ్‌‌లో  ముంబై ఓవర్లన్నీ ఆడి 186/6 స్కోరే చేసి నాలుగో ఓటమి ఖాతాలో వేసుకుంది.  పతిరణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.