టిక్కెట్ కొంటే ఈ రైలులో మూడు పూటలా ఫ్రీ ఫుడ్.. దేశంలోనే ప్రత్యేక రైలు వివరాలివే..

టిక్కెట్ కొంటే ఈ రైలులో మూడు పూటలా ఫ్రీ ఫుడ్.. దేశంలోనే ప్రత్యేక రైలు వివరాలివే..

భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత రద్దీగా నడిచే రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకదిగా పేరు గడించింది. రోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. సాధారణంగా ప్రయాణికులు తమతో పాటు ఆహారం తీసుకెళుతారు లేదా రైల్వే క్యాంటీన్లలో భోజనం కొనుక్కుంటుంటారు. అయితే సచ్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించే వారికి గమ్యస్థానానికి టికెట్ మాత్రమే కాకుండా, మొత్తం ప్రయాణంలో ఉచితంగా భోజనం కూడా అందిస్తున్నారు. ఈ సౌకర్యమే దేశంలోని ఇతర రైళ్లన్నింటి కంటే దీనిని ప్రత్యేకంగా నిలబెట్టింది.

వాస్తవానికు ఉచితంగా ఫుడ్ అందించటం1990లలో ప్రారంభమై 30 ఏళ్లుగా నిరంతరం కొనసాగుతోంది. ఈ కాలంలో లక్షలాది మంది యాత్రికులు ఈ రైలులో ప్రయాణించి లంగర్ అనే ఉచిత సామూహిక భోజనంలో పాలుపంచుకున్నారు. లంగర్ అనేది శతాబ్దాల నుండి కొనసాగుతున్న సిక్కు సంప్రదాయం. ఇది సమానత్వం, దానం, సేవ అనే విలువలకు ప్రతీక.

అసలు సచ్‌ఖండ్‌ రైలులోనే ఫ్రీ ఫుడ్ ఎందుకంటే..?

సచ్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్ దాదాపు 2వేల కిమీ దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలకు 39 నిర్ణీత స్టాప్‌లు ఉంటాయి. అయితే భోజన సమయాల్లో 6 ప్రధాన స్టేషన్లలో ప్రత్యేకంగా ఆగి ఆహారం పంపిణీ చేస్తారు. రైలు తన ప్రయాణ సమయంలో న్యూ ఢిల్లీ, భోపాల్, పర్బణి, జల్నా, ఔరంగాబాద్, మరాఠవాడ స్టేషన్లలో దీనికోసం నిలపబడుతుంది. మెుత్తం 33 గంటల ప్రయాణంలో రోజుకు  అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం పూర్తి ఉచితంగా యాత్రికులకు అందిస్తారు.

ఈ లంగర్ సేవ మొత్తం గురుద్వారాలు సమకూర్చే విరాళాలతో నడుస్తుంది. సిక్కు సంప్రదాయం ప్రకారం లంగర్‌లో అందరికీ ఒకే ఆహారం వడ్డిస్తారు. కులం, మతం, వర్గం, స్థానం వంటి భేదాలేవీ లేకుండా ప్రతి ప్రయాణికుడికి జనరల్ క్లాస్ నుంచి ఏసీ కోచ్ ల వరకు ఒకేలా భోజనం అందుతుంది. ఇక్కడ ఇచ్చే భోజనం విలాసవంతంగా లేకపోయినా ఆరోగ్యకరంగా, రుచిగా ఉంటుంది. పైగా పరిశుభ్రతను కాపాడటానికి ప్రయాణికులు తనతమ పాత్రలు, చెంచాలు తెచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులోని ఆధ్యాత్మిక కోణాన్ని గమనిస్తే.. సచ్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్ కేవలం ఒక రైలు కాదు. అది ఒక అనుభవం. ఈ ప్రయాణంలో యాత్రికులు గమ్యం చేరడమే కాకుండా.. సేవా భావం, దాతృత్వం, భక్తి, సమానత్వం వంటి విలువలను ప్రత్యక్షంగా అనుభవిస్తారు. ప్రతి ప్రయాణికుడు గౌరవంతో, ఆత్మీయతతో వడ్డించే ఉచిత భోజనం రుచి చూసే క్షణం జీవితాంతం గుర్తుండిపోతుంది. 

రైలు మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్ మధ్య నడుస్తుంది. నాందేడ్‌ను 10వ సిక్కు గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ జీ అంతిమ విశ్రాంతి స్థలంగా గౌరవిస్తారు. అలాగే అమృత్‌సర్‌లో సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం స్వర్ణ దేవాలయం ఉంది. దీని కారణంగా రైలు ప్రయాణాన్ని చక్రాలపై ఆధ్యాత్మిక తీర్థయాత్రగా ప్రజలు భావిస్తారు.