
శాలిగౌరారం,(నకిరేకల్), వెలుగు: వల్లాల అమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారి ఫ్యామిలీలను ఆదుకుంటామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. నల్గొండ జిల్లా వల్లాల గ్రామంలో నిర్మించిన తెలంగాణ అమరవీరుల పైలాన్ ను సీనియర్ నేత జానారెడ్డితో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వల్లాల గ్రామంలో 10 మంది యువకులు 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మూడు రంగుల జెండాను ఎగురవేయగా, వారిని రజాకార్లు దారుణంగా హత్య చేశారని గుర్తు చేశారు. ఈ ఘటన ఇప్పటి వరకు ఎందుకు బయటకు రాలేదో అర్థం కావడం లేదన్నారు.
యువకుల త్యాగాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ సాయుధ పోరాటంలో వారి చరిత్ర ఉండేలా చూస్తానని, వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు మాత్రమే పాల్గొన్నారని తెలిపారు. బీజేపీ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని విమర్శించారు.
కులాలు, మతాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందన్నారు. సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామెల్, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పాల్గొన్నారు.