రైతు బిడ్డలకు జాబ్‌ లెటర్స్ ఇవ్వలేకపోవడం బాధగా ఉంది: కొత్త సీఎంపై ఆశలు

రైతు బిడ్డలకు జాబ్‌ లెటర్స్ ఇవ్వలేకపోవడం బాధగా ఉంది: కొత్త సీఎంపై ఆశలు

చండీగఢ్: పంజాబ్‌కు కొత్త సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించాక దానిపై కెప్టెన్ అమరిందర్ సింగ్ స్పందించారు. చన్నీకి ఆయన అభినందనలు తెలిపారు. పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగి ఉన్న ఈ రాష్ట్రాన్ని ఆయన సేఫ్‌గా కాపాడగలరని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు క్రాస్ బోర్డర్ సెక్యూరిటీ ముప్పు నుంచి రక్షణ కల్పించగలరని ఆశిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు కెప్టెన్‌ పేర్కొన్నట్లుగా ఆయన మీడియా అడ్వైజర్ రణ్‌వీర్ తుక్రాల్ ట్వీట్ చేశారు.

నా చేతులతో ఇవ్వలేకపోవడం బాధగా ఉంది

కేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన 150 మంది రైతుల కుటుంబంలో అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు ఇస్తానని గతంలో తాను హామీ ఇచ్చానని అమరిందర్ చెప్పారు. అయితే దీనికి సంబంధించిన జాబ్‌ లెటర్స్‌ వాళ్లకు తన చేతుల మీదుగా అందజేయలేకపోవడం బాధగా ఉందని ఆయన పేర్కొన్నారు. కొత్త సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు.