
- అప్లికెంట్లకు నోటీసుల జారీ ప్రారంభం
- వెరిఫికేషన్‌పై కసరత్తులు చేస్తున్న యంత్రాంగం
- ఉమ్మడి జిల్లాలో 1.89 లక్షల అప్లికేషన్లు
జనగామ, వెలుగు: సాదా బైనామా అప్లికేషన్లకు లైన్‌క్లియర్ కావడంతో బాధిత రైతుల్లో ఆనందం నెలకొంది. అప్లై చేసుకుని ఏండ్లు గడుస్తున్నా, ఇన్నాళ్లూ పట్టింపు లేక అవస్థలు పడ్డ వారికి కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయం ఉపశమనం కలిగించింది. సాదాబైనామాల క్రమబద్ధీకరణ నోటిఫికేషన్ వెలువడడంతో అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. పెండింగ్ అప్లికెంట్లకు నోటీసులు జారీ షురూ చేశారు. ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
1.89 లక్షల అప్లికేషన్లు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,89,739 సాదాబైనామా అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో జనగామ జిల్లాలో 33,305 అప్లికేషన్లు, హనుమకొండలో 27,057, వరంగల్ లో 26,630, జయశంకర్ భూపాలపల్లిలో 51,347, ములుగులో 20,150, మహబూబాబాద్ జిల్లాలో 31,250 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2014 జూన్ 2 కు ముందు జరిగిన సాదా బైనామాలను అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఉచితంగా క్రమబద్ధీకరించింది.
2020లో మరోసారి అప్లికేషన్లను తీసుకోగా, పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా, కాంగ్రెస్ సర్కారు భూ భారతి చట్టంలో వెసులుబాటు కల్పించడంతో ప్రక్రియ మొదలైంది. 2014 జూన్ 2 కు ముందు కొనుగోలు చేసిన భూములకు సంబంధించి 12 అక్టోబర్ 2020 నుంచి 10 నవంబర్ 2020 వరకు మీ సేవల్లో అప్లై చేసుకున్న సాదాబైనామాలను ప్రస్తుతం క్లియర్ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఇప్పుడున్న మార్కెట్వ్యాల్యూ ఆధారంగా స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉండగా, వీటి పరిష్కారం పై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించారు. జనగామలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్ రెవెన్యూ అధికారులతో రివ్యూ చేపట్టారు. నోటీసులు జారీ చేసి క్రమబద్ధీకరణను స్పీడప్ చేయాలని ఆదేశించారు. ఇటీవల జీపీవోలు విధుల్లో చేరడంతో ఫీల్డ్లెవల్ విచారణకు ఇక్కట్లు తొలగినట్లయింది.
నోటీసుల జారీ స్పీడప్..
సాదాబైనామా అప్లికెంట్లకు అధికారులు శుక్రవారం నుంచి నోటీసుల జారీ ప్రారంభించారు. సాదాబైనామా అప్లికెంట్ తోపాటు భూమి అమ్మిన వ్యక్తికి నోటీసులు జారీ చేస్తున్నారు. అదేవిధంగా సదరు గ్రామ పంచాయతీకి కూడా సమాచారం ఇస్తున్నారు. నోటీసుల ఆధారంగా ఫీల్డ్లెవల్ఎంక్వైరీ చేయనున్నారు. కొనుగోలుదారుడు, అమ్మిన వ్యక్తి వివరాలు, సాదాబైనామా పత్రాన్ని, పహాణీ నకల్, భూ విస్తీర్ణం, సర్వే నంబర్, హద్దులు తదితర వివరాలపై విచారణ జరిపి రిపోర్టును సమర్పించనున్నారు.
కాగా, జనగామ జిల్లాలో మొత్తం 33,305 అప్లికేషన్లు ఉండగా, నోటీసులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలాఉండగా, అప్లికెంట్సదరు భూమిలో సాగులో ఉన్నట్లు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని, భూమి అమ్మిన వ్యక్తి నుంచి ఎటువంటి అభ్యంతరం లేకుంటేనే సాదాబైనామా క్రమబద్ధీకరణ జరుగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు సదరు వ్యక్తి పేరిట ఉన్న పట్టాదారు పాసు బుక్కులో భూమి ఉంటేనే దానిని సాదాబైనామా అప్లికెంట్కు క్రమబద్ధీకరణ చేయనున్నట్లు చెబుతున్నారు. అమ్మిన వ్యక్తి పాసు బుక్కులో భూమి లేకుంటే చేయడం వీలుకాదంటున్నారు. అమ్మిన వ్యక్తి సమ్మతి తెలుపకుంటే అందుకు గల ఆధారాలు అధికారులకు అందించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
సాదాబైనామా ప్రక్రియ స్పీడప్..
సర్కారు ఆదేశాలతో సాదాబైనామా ప్రక్రియ స్పీడప్ చేశాం. అప్లికెంట్లకు నోటీసుల జారీ, ఫీల్డ్లెవల్ ఎంక్వైరీ ప్రారంభించాం. అమ్మినవారు, కొన్నవారి వివరాలను పరిశీలించి అర్హులైన అప్లికెంట్లకు క్రమబద్ధీకరణ చేస్తాం. ప్రక్రియ అంతా పారదర్శకంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నాం. 2014 జూన్2 కు ముందు కొనుగోలు చేసి 2020లో అప్లై చేసుకున్న వారి అప్లికేషన్లను క్రమబద్ధీకరించనున్నాం.- గోపీరామ్, ఆర్డీవో, జనగామ