
- పూలవనంలా మారిన ఓరుగల్లు
- కరీంనగర్లో శోభాయమానంగా మానేరుతీరం
నెట్వర్క్/వరంగల్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఆడబిడ్డల ఆటపాటలతో ఊరువాడ హోరెత్తాయి. ప్రధానంగా ఓరుగల్లు పూలవనంగా మారింది. గ్రేటర్ వరంగల్ హనుమకొండలోని పద్మాక్షి ఆలయ గుండం వద్దకు వేలాది మంది మహిళలు చేతుల్లో బతుకమ్మలు, సంప్రదాయ చీరకట్టులో పిల్లాపాపలతో తరలివచ్చారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. చిత్తూ చిత్తూల బొమ్మ శివునీ ముద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ బావిలోన’ అంటూ ప్రకృతిపూల మధ్యనున్న పసుపు గౌరమ్మను భక్తిశ్రద్దలతో కొలిచారు.
కోలాటాలు ఆడారు. పల్లీలు, నువ్వులు, సత్తిపిండిలతో కూడిన సద్దులను ప్రసాదాలు, వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కరీంనగర్లో మానేరుతీరం ఆడబిడ్డల ఆటపాటలతో పులకించిపోయింది. శ్రీ మహాశక్తి దేవాలయం, గిద్దపెరుమాండ్ల స్వామి ఆలయాల సన్నిధిలో జరిగిన బతుకమ్మ వేడుకలను వీక్షించేందుకు రెండు కళ్లూ చాలలేదు. చివరగా ‘పోయిరావమ్మ బతుకమ్మ.. చల్లగాసూడు బతుకమ్మ..’ అంటూ మానేరులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు మొదలైన సంబురాలు రాత్రి 10 గంటల వరకు కొనసాగాయి. వేడుకలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఆయాచోట్ల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
హుస్నాబాద్ఎల్లమ్మ చెరువు వద్ద జరిగిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటలోని కోమటిచెరువు వద్ద బతుకమ్మ సంబరాలు కన్నులపండువగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు దంపతులు పాల్గొన్నారు.