నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పూల జాతర ఘనంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. పల్లెలు, పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మలను ఉంచి గౌరమ్మకు పూజలు చేసిన అనంతరం ఆడి పాడారు. మహిళలు, చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి పూల జాతరలో పాల్గొని బతుకమ్మ ఆడారు.

 ‘చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ దొరికెనమ్మో.. ఈ వాడలోన.. బంగారు బిందె తీస్క.. బామ్మ నీళ్లకు పోతే భగవంతుడెదురాయే నమ్మో.. ఈ వాడలోన..’ ‘శ్రీరామ చంద్రుడు ఉయ్యాలో.. అయోధ్య పట్నాన ఉయ్యాలో..’ ‘వానలొచ్చినాయి ఉయ్యాలో.. పుట్లకొద్ది పూలు పూసే ఉయ్యాలో..’ ‘ అంటూ పాడిన పాటలు అలరింపజేశాయి. చిన్నారులు పటాకులు కాల్చుతూ సందడి చేశారు. అనంతరం గ్రామ, పట్టణ సమీపాల్లోని వాగులు, చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. -వెలుగు నెట్​వర్క్​