కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా  సద్దుల బతుకమ్మ సంబురాలు

ఉమ్మడి కరీంనగర్​జిల్లా వ్యాప్తంగా సోమవారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఊరూవాడ, పల్లెపట్నం, చెరువులు, కుంటలు పూల వనాలుగా మారాయి. భక్తిశ్రద్ధలతో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడపడుచులు ఒక్కచోట చేరి ఆడిపాడారు. ఈనెల 21న ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన వేడుకలు సద్దుల బతుకమ్మతో ఘనంగా ముగిశాయి. కరీంనగర్ సిటీలో మహాశక్తి ఆలయం, రాంనగర్, గోకుల్ నగర్, భగత్ నగర్, కోతిరాంపూర్, టవర్ సర్కిల్, మార్క్ ఫెడ్ గ్రౌండ్స్ లో మహిళలు బతుకమ్మలతో పెద్ద ఎత్తున తరలివచ్చి ఆడిపాడారు. 

 

చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి 'పోయిరా బతుకమ్మ.. పోయి రావమ్మా' అంటూ సాగనంపారు. ఆ తర్వాత మహిళలు సద్దుల ఫలహారం పంచి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. మహాశక్తి ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, అపర్ణ దంపతులు, గణేశ్ నగర్ లో రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంకమ్మ తోటలోని రమా సహిత సత్యనారాయణస్వామి ఆలయం వద్ద బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. - కరీంనగర్​ నెట్​వర్క్​