
దేశ రాజకీయం.. గాంధీ నుంచి గాడ్సే వైపు టర్న్ తీసుకున్నాయి. తొలి హిందూ టెర్రరిస్ట్ గాడ్సే అంటూ.. MNM అధ్యక్షుడు కమల్ హాసన్ రాజేసిన మంటలు ఆరకముందే.. బీజేపీ ఎంపీ అభ్యర్థిని సాధ్వీ ప్రజ్ఞాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాడ్సే ఎప్పటికీ దేశభక్తుడే అంటూ పొగిడి.. దేశ రాజకీయాల్లో సునామీ సృష్టించారు.
ప్రగ్యా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను.. భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థి, ఆమె ప్రత్యర్థి దిగ్విజయ్ సింగ్ ఖండించారు. సాధ్వీ కామెంట్స్ పై.. మోడీ, అమిత్ షా, మధ్యప్రదేశ్ బీజేపీ నాయకత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాడ్సేది దేశభక్తి కాదని.. రాజద్రోహమని డిగ్గీ అన్నారు.
ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వ్యాఖ్యలను.. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా ఖండించారు. గాంధీని చంపిన గాడ్సేను.. బీజేపీ నేతలు దేశభక్తుడిగా చెబుతూ.. నిజంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వాళ్లను మాత్రం.. దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
గాంధీని హత్యచేసిన గాడ్సే దేశభక్తుడైతే.. గాంధీ జాతి వ్యతిరేక వాదా అని కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ లో ప్రశ్నించారు.
జాతిపితను సాధ్వి అవమానించారు : KTR
ప్రగ్యా సింగ్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. “రాజకీయంగా ఏ సూత్రాలకు కట్టుబడి ఉన్నా.. సిద్ధాంతం ఏదైనా.. దాటకూడని కొన్ని హద్దులుంటాయి. సాధ్వీ ప్రజ్ఞా సింగ్ చేసిన కామెంట్స్ ఖండించతగ్గవి. నమ్మిన నీతికి నష్టం కలిగించేవి. మహాత్ముడు, జాతి పిత గురించి చౌకబారుగా, కించపరిచేలా మాట్లాడినందుకు… బేషరతుగా ఆమె క్షమాపణలు చెప్పాలి” అని కేటీఆర్ అన్నారు.
సొంత పార్టీనుంచే విమర్శలు…
గాడ్సే దేశభక్తుడన్న ప్రజ్ఞా కామెంట్స్ ను సొంత పార్టీ బీజేపీ తప్పుపట్టింది. సాధ్వీ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు సూచించారు.
సారీ చెప్పిన సాధ్వి
రాజకీయ దుమారం తర్వాత.. ప్రగ్యాసింగ్ ఠాకూర్ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. గాడ్సే దేశభక్తుడంటూ చేసిన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణ చెప్పారు. దీనిపై.. మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడికి ఆమె వివరణ ఇచ్చారు.