- 30 రన్స్‌తో గెలిచిన సౌతాఫ్రికా
- ఇండియా గడ్డపై 15 ఏండ్ల తర్వాత సఫారీల తొలి విజయం
- అదరగొట్టిన బవూమ, హార్మర్
కోల్‌కతా: సౌతాఫ్రికాను స్పిన్‌తో దెబ్బకొట్టాలని భావించిన టీమిండియా వ్యూహం ఘోరంగా బెడిసి కొట్టింది. స్వదేశంలోనూ నాణ్యమైన స్పిన్నర్లను ఎదుర్కోలేని బలహీనతలను మన బ్యాటర్లు మరోసారి బయటపెట్టుకున్నారు. ఫలితంగా చిన్న లక్ష్య ఛేదనలో చతికిలపడిన ఇండియా.. సౌతాఫ్రికాతో మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్‌లో 30 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. దాంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీ జట్టు 1–0 లీడ్‌లో నిలిచింది. ప్రొటీస్ నిర్దేశించిన 124 రన్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆదివారం బరిలోకి దిగిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 93 రన్స్‌కే కుప్పకూలింది.
వాషింగ్టన్ సుందర్ (31), అక్షర్ పటేల్ (26) పోరాడినా మిగతా వారు బ్యాట్లెత్తేశారు. మెడ గాయం కారణంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు దిగలేదు. అంతకుముందు 93/7 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 153 రన్స్‌కు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ టెంబా బవూమ (55 నాటౌట్), కార్బిన్ బాష్ (25) మెరుగ్గా ఆడారు. మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు తీసిన హార్మర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్ శనివారం నుంచి గువాహటిలో జరుగుతుంది. ఇక గత ఆరు టెస్ట్‌ల్లో గిల్‌సేనకు ఇది నాలుగో ఓటమి కాగా, 15 ఏండ్ల తర్వాత సౌతాఫ్రికా.. ఇండియా గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది.
బవూమ నెమ్మదిగా..
29 రన్స్ ఓవర్ నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన బవూమ, బాష్ ప్రశాంతంగా ఆడారు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఆచితూచి బ్యాటింగ్ చేశారు. అదే టైమ్‌లో క్లబ్ హౌస్ ఎండ్ నుంచి బుమ్రా (1/24)ను బౌలింగ్‌కు దించకపోవడం స్టాండిన్ కెప్టెన్ పంత్ చేసిన అతి పెద్ద తప్పిదం. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఈ ఎండ్ నుంచి బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. పంత్ వ్యూహాన్ని బాగా ఉపయోగించుకున్న బవూమ, బాష్ 44 నిమిషాల పాటు ఇండియా మిగతా బౌలర్లను విసిగించారు.
ఫైన్ లెగ్ బౌండ్రీతో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన బవూమ.. సిరాజ్ (2/2) బౌలింగ్‌లో బాల్ లెగ్ స్టంప్ మిస్ కావడంతో ఎల్బీ నుంచి బయటపడ్డాడు. అప్పటికే సఫారీల స్కోరు 100 దాటింది. చివరకు 48వ ఓవర్‌లో బుమ్రా.. బాష్‌ను ఔట్ చేసి ఎనిమిదో వికెట్‌కు 44 రన్స్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అయినా బవూమ సింగిల్స్, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే 54వ ఓవర్‌లో సిరాజ్ నాలుగు బాల్స్ తేడాలో హార్మర్ (7), కేశవ్ (0)ను ఔట్ చేయడంతో ఇండియా ముందు చిన్న టార్గెట్‌ను నిర్దేశించింది. జడేజా 4, కుల్దీప్, 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.
మనోళ్లు క్యూ కట్టారు...
చిన్న లక్ష్య ఛేదనకు దిగిన ఇండియాను ఆరంభంలోనే యాన్సెన్ (2/15) దెబ్బకొట్టాడు. లంచ్‌కు కొద్ది ముందు తన వరుస ఓవర్లలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1)ను ఔట్ చేశాడు. దాంతో 10/2తో ఇండియా ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో సుందర్ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను సమర్థంగా నిర్వహించినా.. రెండో ఎండ్‌లో అతనికి సహకారం దక్కలేదు. హార్మర్ (4/21) స్పిన్ దెబ్బకు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ముందుగా ధ్రువ్ జురెల్ (13) భారీ షాట్ ఆడబోయి డీప్ మిడ్ వికెట్‌లో బాష్‌కు చిక్కాడు.
ఆ వెంటనే రిషబ్ పంత్ (2) స్లో బాల్‌కు హార్మర్‌కే క్యాచ్ ఇచ్చాడు. కొద్దిసేపటికే రవీంద్ర జడేజా (18) క్లీన్ యార్కర్‌కు వికెట్ల ముందు దొరికాడు. 64/5 వద్ద వచ్చిన అక్షర్ పటేల్ నెమ్మదిగా ఆడినా.. అప్పటి వరకు నిలకడగా ఆడిన సుందర్‌ను పార్ట్ టైమర్ మార్‌క్రమ్ (1/5) ఆఫ్ బ్రేక్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే కుల్దీప్ యాదవ్ (1)ను హార్మర్ వెనక్కి పంపితే.. కేశవ్ (2/37) దెబ్బకు అక్షర్‌తో పాటు సిరాజ్ (0) పెవిలియన్‌కు చేరడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 159 ఆలౌట్, ఇండియా తొలి ఇన్నింగ్స్: 189 ఆలౌట్, సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 54 ఓవర్లలో 153 ఆలౌట్ (బవూమ 55*, జడేజా 4/50).
ఇండియా రెండో ఇన్నింగ్స్ (టార్గెట్ 124):
35 ఓవర్లలో 93 ఆలౌట్ (సుందర్ 31, అక్షర్ 26, హార్మర్ 4/21, యాన్సెన్ 2/15).
పిచ్ పై రాక్షసులేం లేరు:గంభీర్
124 రన్స్‌టార్గెట్ ఛేదించదిగిందే. ఇది ఆడలేని వికెట్ కూడా కాదు. అక్కడేమీ రాక్షసులు లేరు. కానీ మా బ్యాటర్లు ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. సవాల్‌తో కూడిన పిచ్‌పై రన్స్ చేసే మార్గాన్ని కనుగొనలేకపోయారు. ఇది కఠినమైన పిచ్ అని నేను భావించను. బ్యాటర్ టెక్నిక్, మానసిక ధృడత్వాన్ని పరీక్షించే వికెట్ ఇది. ఎక్కువసేపు క్రీజులో ఉంటే రన్స్ వచ్చేవి. మంచి డిఫెన్స్ ఆడిన సుందర్, బవూమ రన్స్ రాబట్టారు. మేం కోరుకున్న వికెట్‌నే క్యూరేటర్ ఇచ్చారు. కానీ మనం బాగా ఆడనప్పుడు ఫలితాలు ఇలానే ఉంటాయి.
ఇండియాలో జరిగిన టెస్ట్‌ల్లో ప్రత్యర్థి జట్టు కాపాడుకున్న రెండో అత్యల్ప లక్ష్యం (124) ఇది. 2004-–05లో వాంఖడేలో ఆసీస్ 107 రన్స్ టార్గెట్‌ను కాపాడుకుంది.
చిన్న టార్గెట్ (124) ఛేజింగ్‌లో ఇండియా ఫెయిల్ కావడం ఇది రెండోసారి. 1996–97లో విండీస్‌పై 120 రన్స్‌ను కూడా ఛేదించలేకపోయింది.
ఈడెన్ గార్డెన్స్‌లో ఆడిన 43 టెస్ట్‌ల్లో ఇండియా పదిసార్లు ఓడింది. లార్డ్స్ తర్వాత
(43 టెస్ట్‌ల్లో 13 ఓటములు) ఎక్కువగా ఓడిన స్టేడియం ఇదే
