- అరుదైన రికార్డు సృష్టించిన సాయి జాధవ్
న్యూఢిల్లీ: భారత సైనిక చరిత్రలో చరిత్రాత్మక ఘటన చోటు చేసుకుంది. డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ) నుంచి తొలిసారిగా సాయి జాధవ్ (23) అనే మహిళా ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ గా నియమితులయ్యారు. ఐఎంఏ నుంచి భారత సైన్యంలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి మహిళా ఆఫీసర్ గా రికార్డు సృష్టించారు.
93 ఏండ్ల ఐఎంఏ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆఫీసర్ క్యాడెట్ గా ట్రైనింగ్ ను పూర్తి చేసుకోవడంతో సాయి జాధవ్‌ను అందరు అభినందిస్తున్నారు. 1932లో ఐఎంఏ స్థాపించినప్పటి నుంచి 67 వేల మంది కంటే ఎక్కువ మంది ఆఫీసర్ క్యాడెట్లు పాస్ కాగా, వారిలో ఇప్పటి వరకు ఎవరూ మహిళలు లేరు. సాయి జాధవ్ కుటుంబానికి ఇండియన్ ఆర్మీతో బలమైన అనుబంధం ఉంది.
ఆమె ముత్తాత బ్రిటీష్ సైన్యంలో, తాత భారత సైన్యంలో, తండ్రి సందీప్ జాధవ్ నేటికీ సైన్యంలో సేవలందిస్తున్నారు. ఆ కుటుంబం నుంచి ఆర్మీలోకి చేరుతున్న నాలుగో తరం ఆఫీసర్ గా సాయి జాధవ్ రికార్డు సృష్టించారు. కాగా, ప్రస్తుతం 8 మంది మహిళా ఆఫీసర్ క్యాడెట్లు ఇండియన్
మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.
