
తన అందం...అభినయం..నటనా కౌశల్యంతో టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు పొందింది సహజనటి సాయిపల్లవి. భానుమతిగా..బావకు మరదలిగా క్యూట్ క్యూట్ పర్ఫామెన్స్ తో కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అయితే ఇటీవల తెలుగు సినిమాల్లో నటించడం తగ్గించిన సాయిపల్లవి..అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో అభిమానులను పలుకరిస్తూ ఉంటుంది. తాజాగా తన వ్యక్తిగత విషయాన్ని అభిమానులతో పంచుకుని భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం సాయిపల్లవి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దేశంలో పరమ పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్రకు సాయి పల్లవి తన ఫ్యామిలీతో కలిసి వెళ్లింది. ఈ యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ.. తన మనసులోని భావాలను పోస్ట్ చేసింది.
సాయిపల్లవి ఎమోషనల్...
సాధారణంగా వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడను. కానీ అభిమానులకు, నా శ్రేయోభిలాషులకు అమర్‌నాథ్ యాత్ర తీర్థయాత్ర గురించి చెప్పాలనుకుంటున్నా. ఈ యాత్ర గురించి ఎంతోకాలం నుంచి కలలు కన్నాను. 60 ఏళ్ల వయసున్న నా తల్లిదండ్రులను ఈ యాత్రకు తీసుకువెళ్లడం సవాళ్లతో కూడుకున్నది. కొన్నిసార్లు వాళ్లు ఊపిరి తీసుకోవడానికి ఆయాసపడ్డారు. ఛాతి పట్టుకోవడం.... దారిలో అలిసిపోవడం వంటి పరిస్థితులు చూశా. ‘స్వామీ.. మీరు ఎందుకు ఇంకెంత దూరంలో ఉన్నారని ప్రశ్నించా. దైవ దర్శనం తర్వాత నా ప్రశ్నకు సరైన సమాధానం దొరికింది. కొండ దిగి కిందకు వచ్చేటప్పుడు మనసుని హత్తుకునే ఆ దృశ్యాన్ని చూశా. యాత్రను కొనసాగించలేక పలువురు యాత్రికులు ఇబ్బందిపడుతూ ఉండగా.... వాళ్లలో ధైర్యం నింపడం కోసం చుట్టు పక్కన ఉన్నవాళ్లందరూ ‘ఓం నమః శివాయా’ అంటూ ఆ స్వామి నామాన్ని గట్టిగా స్మరించారు. వెళ్లలేం అనుకున్న యాత్రికులు కూడా ఒక్కసారిగా స్వామి వారిని తలచుకుని ముందుకు అడుగులు వేశారు...
చనిపోయినవాళ్ల కిందే లెక్క..
సృష్టిలో మనిషి జీవితం కూడా ఒక తీర్థయాత్ర వంటిదే. అమర్ నాథ్ యాత్ర ద్వారా నాకు ఆ విషయం అర్థమైంది. సాటి మనుషులకు సాయపడకపోతే మనం చనిపోయినవాళ్లకిందే లెక్క అనే విషయం బోధపడేలా చేసింది ఈ అమర్ నాథ్ యాత్ర" అని సాయిపల్లవి వివరించింది. అంటూ సాయిపల్లవి ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.