సాయి సుధను మెచ్చుకున్న ప్రధాని మోడీ

సాయి సుధను మెచ్చుకున్న ప్రధాని మోడీ

సాయి సుధ చేబ్రోలు..సెప్టెంబర్​ 26 న బ్రాడ్​కాస్ట్​ అయిన  ‘మన్​ కీ బాత్’​లో వినిపించింది ఈ పేరు.  గుజరాత్​లోని ఆనంద్‌లో ఆయుర్వేద ప్రొడక్ట్స్​తయారు చేస్తున్న ఈమె గురించి మన్ కీ బాత్‌లో  ప్రత్యేకంగా మాట్లాడారు మోడీ. తన స్టార్టప్‌లో మహిళలకే ఎక్కువ జాబ్స్​ ఇచ్చి ప్రధాని  ప్రశంసలు అందుకున్న సాయి సుధ చేబ్రోలు మన తెలుగావిడే. ఈమె సొంతూరు విజయనగరం జిల్లా గరివిడి. ఈ సందర్భంగా ఆమెని పలకరిస్తే...

దగ్గుకి తులసి. గొంతు నొప్పికి లవంగాలు. జలుబు చేస్తే మిరియాలు. పైత్యానికి శొంఠి పొడి. దెబ్బతగిలితే పసుపు. జ్వరమొస్తే అల్లం, శొంఠి, మిరియాలతో చేసిన కషాయం.  అజీర్తికి వాము. జుట్టు రాలితే ఉల్లిగడ్డ. మొటిమలకి సున్నిపిండి. ఇది మన ఇంటి ట్రీట్మెంట్​. అమ్మమ్మలు, నాన్నమ్మల కాలం నుంచి వస్తొంది. ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్స్​ ఉండవు. ఈ విషయాన్నే బలంగా నమ్మింది సుధ. తను నమ్మిన విషయాన్ని నలుగురికీ పంచాలని స్టార్టప్​ మొదలుపెట్టింది.  ‘బిల్వమ్​ హెర్బల్’​ పేరుతో ఆయుర్వేద ప్రొడక్ట్స్​ తయారుచేస్తోంది. అయితే ఈ ఆలోచనకి బీజం మాత్రం తన పదమూడో యేటనే పడింది అంటోంది సుధ.

‘‘నా పదమూడేళ్ల వయసులో అమ్మకి క్యాన్సర్​ అని  తెలిసింది. ఎంత పెద్ద సమస్యకి అయినా ఆయుర్వేదాన్ని మించిన సొల్యూషన్​ లేదంటారు మా నాన్న. అందుకే అమ్మకి ఆయుర్వేద మందులే ఇప్పించారు. తక్కువ టైంలోనే  అమ్మ పూర్తిగా కోలుకుంది కూడా. అది చూసిన నాలో ‘‘అసలు ఆయుర్వేదం అంటే ఏంటి? ’’  అన్న క్వశ్చన్​ మొదలైంది. రీసెర్చ్​ మొదలుపెట్టా. ఎంతోమంది ఆయుర్వేద డాక్టర్స్​ని కలిసి ట్రీట్మెంట్, మెడిసిన్​  పనితీరు  గురించి నాకున్న డౌట్స్​ అన్నీ అడిగా. కానీ, ఆయుర్వేదాన్ని కెరీర్​గా మలుచుకోవాలన్న ఆలోచన అప్పుడు లేదు. అందుకే  ఎమ్​.ఏ జర్నలిజంలో  డెవలప్​మెంట్​ కమ్యూనికేషన్​ తీసుకున్నా. హెల్త్​ కమ్యూనికేషన్​ స్పెషలిస్ట్​గా  ఢిల్లీ, భువనేశ్వర్​లోని ఎన్జీవోలు, గవర్నమెంట్​తో కలిసి దాదాపు పదిహేనేళ్లు పనిచేశా. ఆ టైంలో హెల్త్​ సెక్టార్ స్ట్రక్చర్​, ట్రైబల్​ మెడిసిన్​, ఆల్టర్నేటివ్​ థెరపీల గురించి పూర్తిగా అర్థమైంది. ఆ  తర్వాత గుజరాత్​లోని ఇని​స్టిట్యూట్​ ఆఫ్​ రూరల్​ మేనేజ్​మెంట్​ ఆనంద్​లో  ప్రొఫెసర్​గా మా ఆయనకి  ట్రాన్స్​ఫర్​ అయ్యింది. గుజరాత్​ షిఫ్ట్​ అయ్యాక బెంగళూరులోని ఓ కంపెనీకి ఫ్రీలాన్స్​ కన్సల్టెంట్​​గా పనిచేశా. ఆ టైంలోనే అనుకోకుండా నాకిష్టమైన ఆయుర్వేదం వైపు వచ్చా.

అలా మొదలైంది..

నాలుగేళ్ల కిందట తమిళనాడులో ఉంటున్న దండపాణి శాస్త్రిగారిని కలిశా. ఆయనకి ఏ మూలిక ఎలా పనిచేస్తుంది? వాటి ఔషధ గుణాలు ఏంటి? అనే విషయాలు బాగా తెలుసు. ​ ఆయన దగ్గర సంవత్సరం పాటు మూలికల తయారీకి సంబంధించిన ట్రైనింగ్​ తీసుకున్నా.  ఆ ఎక్స్​పీరియెన్స్​తో  గుజరాత్​లోని మా  ఇంటి పెరట్లో మారేడు చెట్టు, పారిజాతం, పసుపు, తులసి, వేప, పుదీనా లాంటి ఔషధ గుణాలున్న మొక్కలతో హెర్బల్ గార్డెన్​ పెంచా.  అవి చూసిన  శాస్త్రి గారు వాటన్నింటిని పౌడర్​​ చేసి అమ్మమని  సలహా ఇచ్చారు. ఆ సలహాతో  2019 నుంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్​కి ఆ పౌడర్స్​ పంపించి ఫీడ్​ బ్యాక్​ తీసుకున్నా. రెస్పాన్స్​ ​ బాగుండటంతో శొంఠి, నేరేడు, వేప, బిల్వ పత్రాలు పౌడర్స్​ కూడా అమ్మడం మొదలుపెట్టా.  బరువు తగ్గడానికి, డయాబెటిక్​ పేషెంట్స్​కి కూడా ఆయుర్వేద పొడులు తయారుచేశా. అవన్నీ మంచి రిజల్ట్స్​ ఇస్తుండటంతో 2020 ఆగష్టులో ‘బిల్వమ్ జగన్మాత హెర్బల్’ పేరుతో మార్కెట్​లోకి వచ్చా. 

4 నెలల కిందట ఆయుష్​ లైసెన్స్​ వచ్చింది. దాంతో ఆయుర్వేద పొడులతో పాటు బ్యూటీ ప్రొడక్ట్స్, హెల్త్​ సప్లిమెంట్స్​ కూడా తయారు చేస్తున్నాం. ఆనంద్​ దగ్గర్లోని ‘నాపాడ్​’లో ఫ్యాక్టరీ తీసుకుని అక్కడ్నించే పనిచేస్తున్నాం. దీనంతటికీ ఆనంద్​లోని​ ‘మెడి– హబ్​ టీబీఐ ఇంక్యుబేటర్’​ సాయం చేసింది. మెడిసినల్, అరోమా​ ప్లాంట్స్​ పెంచడానికి మాకు టెక్నికల్​ గైడెన్స్ ఇస్తోంది మెడి– హబ్​. ముడి సరుకు కూడా అందిస్తోంది.  ప్రస్తుతం నలభైకి పైగా ప్రొడక్ట్స్​కి మన దేశంలో అన్ని ప్రాంతాలతో పాటు విదేశాలకి కూడా ఎగుమతి చేస్తున్నాం. కరోనాని ఎదుర్కొనే ఇమ్యూనిటీ బూస్టర్స్​ని కూడా తయారుచేస్తున్నాం. 

ఆడవాళ్లే ఎందుకంటే.. 

‘‘కేవలం హౌజ్​వైఫ్​​గా మిగిలిపోకు. ఏదైనా కొత్తగా ప్రయత్నించి..లైఫ్​లో ఏదైనా సాధించు..నిన్ను చూసి నువ్వు గర్వపడేలా ఉండు’’అని మా  అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది నాకు. కానీ, ఆడవాళ్లందరికి నాకు దొరికినంత సపోర్ట్​ దొరకదు. అలాంటివాళ్లకి సాటి మహిళగా నా వంతు సాయం చేయాలనే నా కంపెనీలో ఆడవాళ్లకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నా.. ఫ్యూచర్​లోనూ  వీలైనంత ఎక్కువమంది ఆడవాళ్లకి ఉద్యోగాలిస్తా.’’

మోడీ మాటలు ధైర్యాన్నిచ్చాయి

‘‘మన్ కీ బాత్‌లో మోడీ జీ ఆనంద్​లోని ఓ చిన్న  ఊళ్లో  మొదలైన మా స్టార్టప్​ గురించి మాట్లాడటం సర్​ప్రైజింగ్​గా అనిపించింది. ఆయన మాటలు నాలో చాలా ధైర్యాన్ని నింపాయి. నాలా బిజినెస్​లో రాణించాలనుకునే ఎంతోమంది ఆడవాళ్లకి ఇన్​స్పిరేషన్​గా నిలిచాయి. ఆయన వల్ల చాలామందికి మా ప్రయత్నం గురించి తెలిసింది” అని సాయి సుధ చెప్పారు.

::: ఆవుల యమున