
కేజీఎఫ్, కాంతార, సలార్ లాంటి చిత్రాలతో మెప్పించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ.. హీరో ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభాస్‌తో ఏకంగా మూడు సినిమాలను నిర్మిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. మునుపెన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో, ఇండియన్ సినిమా స్థాయిని పెంచేలా ఇవి ఉండబోతున్నాయని వెల్లడించింది. ‘సలార్ 2’తో ఈ జర్నీ మొదలవబోతోందని, 2026, 2027, 2028లో ఇవి రానున్నాయని తెలియజేసింది.
ఈ సందర్భంగా నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ ‘సరిహద్దులను దాటే స్టోరీ టెల్లింగ్ పవర్‌ను మేము నమ్ముతాం. ప్రభాస్ కాంబినేషన్‌లో రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూ, ఎంటర్‌టైన్మెంట్ పంచే సినిమాలను తెరకెక్కించబోతున్నాం’ అని చెప్పారు. ఇక ప్రభాస్‌తో ‘సలార్’ తీసిన ప్రశాంత్ నీల్, దీనికి సీక్వెల్‌గా ‘శౌర్యాంగపర్వం’ తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ‘సలార్ 2’ జర్నీ మొదలైందని కూడా శుక్రవారం ప్రకటించారు. దీంతో మిగిలిన రెండు సినిమాలను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాజా సాబ్, స్పిరిట్, కల్కి 2, ఫౌజీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్.