జీతాల కోసం ఉద్యోగుల ఎదురు చూపులు

జీతాల కోసం ఉద్యోగుల ఎదురు చూపులు

హైదరాబాద్ : రాష్ట్ర సర్కారుకు అప్పులు పుట్టినా ఉద్యోగులకు జీతాల తిప్పలు తప్పడం లేదు. 13వ తేదీ వచ్చినా 18 జిల్లాల్లో ఉద్యోగులకు శాలరీలు అందలేదు. పెన్షన్ల పరిస్థితీ అట్లనే ఉన్నది. సమయానికి జీతాలు రాక చెక్ బౌన్సులు అవుతున్నాయని, ఈఎంఐలు కట్టలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పటిదాకా హైదరాబాద్‌‌తోపాటు మరో 14 జిల్లాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే జీతాలు జమ చేశారు. రోజుకు మూడు, నాలుగు జిల్లాలకు శాలరీలు చెల్లిస్తున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5వ తేదీన రూ.3 వేల కోట్ల అప్పు తీసుకున్నది. అయినా జీతాలు ఇచ్చేందుకు నానా తిప్పలు పడుతున్నది. మరోవైపు రైతుబంధు నిధులు కూడా పూర్తిగా జమ చేయలేదు. ఇంకా రూ.2 వేల కోట్ల మేర రైతుబంధుకు చెల్లించాల్సి ఉన్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్).. ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావును కలిసి జీతాలు జమ చేయాలని కోరింది. రెండు, మూడు రోజుల్లో జీతాలు, పెన్షన్ల చెల్లింపులు పూర్తి చేస్తామని స్పెషల్ సీఎస్ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

పెనాల్టీలు తప్పుతలే
ప్రతి నెలా జీతాలు లేట్ అవుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు ఈఎంఐలు, ఇతర చెల్లింపుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. పెనాల్టీలతో చెల్లింపులు చేస్తున్నట్లు వాపోతున్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం విషయంలోనూ సర్కార్ నాన్చుడు ధోరణితో రిటైర్డ్ ఉద్యోగులు మరింత తిప్పలు పడుతున్నారు. పెన్షన్‌‌దారులకు పెన్షన్ అందలేదని తెలిసింది. శాలరీలు ఇచ్చిన తర్వాతే పెన్షన్లు ఇస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.63 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రతినెలా యావరేజ్‌‌గా రూ.1,100 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు, మూడు నెలలకోసారి జీతాలు ఇస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన బెనిఫిట్స్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. వేలమంది రిటైర్డ్ ఉద్యోగులకు ఏదో ఒక బెనిఫిట్ ఆగిపోయింది. సరెండర్ లీవ్, లీవ్ శాలరీలు, మెడికల్ రీయింబర్స్ మెంట్ వంటి బిల్లుల కోసం నెలలు ఆగాల్సి వస్తోందని వాపోతున్నారు.

జీతాలు, పెన్షన్లు వెంటనే విడుదల చేయాలి: టీఎస్‌‌యూటీఎఫ్
జులై నెలలో 12 రోజులు గడిచినా టీచర్లు, ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, ఎయిడెడ్, మోడల్ స్కూల్ సిబ్బంది వేతనాల బడ్జెట్ విడుదల చేయలేదని టీఎస్ టీయూటీఎఫ్ నేతలు మండిపడ్డారు. రెండేండ్లుగా నెల మొదటి పనిదినం నుంచి పదో తేదీ మధ్య రొటేషన్ పద్ధతిలో రోజూ కొన్ని జిల్లాల చొప్పున వేతనాలు జమయ్యేవని, 3 నెలలుగా పదిహేనో తేదీదాకా  ఎప్పుడు జమ అవుతాయో తెలియని అయోమయం నెలకొందన్నారు. ఉద్యోగులు, టీచర్లు ఇంటి చదువుల కోసమో తీసుకున్న బ్యాంకు ఋణాల ఈఎంఐలు ప్రతినెల 5, 10 తేదీల్లో చెల్లించాల్సి ఉంటుందని, గడువు లోపు ఈఎంఐ కట్టడానికి ఖాతాలో డబ్బు లేక పెనాల్టీతో కట్టాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జీపీఎఫ్ సొమ్ము తీసుకుందామనుకుంటే సకాలంలో అందట్లేదన్నారు. నెల మొదటి తేదీనే వేతనాలు, పెన్షన్లు, నిర్ణీత గడువులోగా సప్లిమెంటరీ బిల్లులు విడుదల చేయాలన్నారు.