
మిడ్ డే మీల్స్ కార్మికులు, సహాయకుల వేతనాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రూ.1000లుగా ఉన్న వారి వేతనాన్ని రూ.3వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇకపై కార్మికులకు చెల్లించే వేతనాల్లో రూ.2,400 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుండగా.. మిగిలిన రూ.600లు కేంద్రం నుంచి రానున్నాయి. గత కొన్ని రోజులుగా మిడ్ డే మీల్స్ కార్మికులు సరిపడా జీతాలు అందడం లేదని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే మిడ్ డే మీల్స్ పథకం పేరును పీఎం పోషన్ పథకంగా మార్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీఎం పోషన్ పథకంలో భాగంగా కేంద్రం వాటా 60 శాతం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతంగా ఉంటుంది.