మిషన్​ భగీరథలో జీతాల వెతలు

మిషన్​ భగీరథలో జీతాల వెతలు

హైదరాబాద్​, వెలుగు:  మిషన్  భగీరథ నీటి నాణ్యత పరీక్ష కేంద్రాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్​ ఉద్యోగులకు ఏడాది కాలంగా జీతాలు అందడం లేదు. రాష్ట్రంలో మొత్తం 76  మిషన్​ భగీరథ వాటర్​ టెస్ట్​ ల్యాబ్​లు ఉన్నాయి. వాటిలో దాదాపు 400 మంది పనిచేస్తున్నారు. వారందరికీ ఏడాదిగా సాలరీలు ఇవ్వడం లేదు. జీతాలు ఎప్పుడొస్తాయని ఉన్నతాధికారులను అడిగితే  ‘‘ఉంటే ఉండండి. లేకపోతే వెళ్లిపోండి. అంతేకానీ జీతాల గురించి అడగొద్దు’’ అని కటువుగా మాట్లాడుతున్నారని ఆ ఉద్యోగులు వాపోతున్నారు. ఇది కాకుండా దాదాపు 16 వేల మంది మిషన్​ భగీరథ కార్మికులకు ఇంకా పూర్తి స్థాయిలో జీతాలు అందలేదని తెలిపారు. మొత్తంగా రూ.120 కోట్ల జీతాలు పెండింగ్​లో ఉన్నాయి. జీతాలు రాక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ ఖర్చుల కోసం కూడా అప్పులు చేయాల్సి వస్తోందని, అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు పెట్టి ఇంటింటికీ నీళ్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. 

కొన్ని ప్రాంతాల్లో ఇంకా కనెక్షన్​ పనులు పూర్తికాలేదు. ఉన్నవాటికి  మెయింటెనెన్స్​ లేక నీటి సరఫరా జరగడం లేదు. మిషన్​ భగీరథ నీటిని పరీక్షించేందుకు స్టేట్ లెవెల్​లో ఒక ల్యాబ్, ఉమ్మడి జిల్లాల్లో 9 డిస్ట్రిక్ట్ ల్యాబ్ లు, ఇంకో తొమ్మిది  డివిజన్ ల్యాబ్​లు, 57 సబ్ డివిజన్ ల్యాబ్​లు ఉన్నాయి. 76  మంది  చొప్పున కెమిస్ట్ లు,  మైక్రోబయాలజిస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, హెల్పర్లు​, 20 మంది ల్యాబ్​ అసిస్టెంట్లు, 20 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 9 మంది డిస్ట్రిక్ట్​ కన్సల్టెంట్లు ఇలా మొత్తం 400 మంది నాణ్యత పరీక్షించే ల్యాబ్​లలో పనిచేస్తున్నారు. వారి పని ఆగిపోతే మిషన్ భగీరథ నీటి నాణ్యత ఎలా ఉంది? ఎక్కడ నీటి కలుషితం జరుగుతోందన్న వివరాలు తెలియవు. ఇది మరింత ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. 

ఎక్కడైనా నీరు కలుషితం అయినా, ఫిర్యాదులు వచ్చినా సిబ్బంది మొత్తం పాల్గొని  నీటి నమూనాలు సేకరించి టెస్టులు చేస్తారు. అయితే వీరంతా ఇప్పుడు రావాల్సిన జీతాలు కూడా సకాలంలో రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీతాల కోసం వారు సమ్మె చేస్తే నీటి కాలుష్యంపై సమాచారం రాక ప్రజలు ఇబ్బందిపడే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఏడాది కాలంగా పెండింగ్​లో ఉన్న జీతాలు ఇప్పించాలని ఆ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.