ఇత్తడిని బంగారంగా నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

ఇత్తడిని బంగారంగా నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

ఇత్తడిని బంగారంగా నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ఘరానా అంతర్రాష్ట ముఠా గుట్టురట్టైంది. ఇత్తడి బిళ్లలకు బంగారం పూత పూసి గోల్డ్ కాయిన్స్ గా నమ్మిస్తున్న  ఇద్దరు సభ్యుల ముఠాను సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి  రూ.9లక్షల నగదుతో పాటు ఐదు కిలోల మహావీర్ జైన్ విగ్రహాన్ని, 3.8 కిలోల బరువున్న 380  ఇత్తడి కాయిన్స్ తో పాటు బంగారు పూత పూసిన 5 ఇత్తడి కాయిన్స్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ తలిగ్రామ్ మండలం అక్రమాబాద్ కు చెందిన అర్జున్ సింగ్ అలియాస్ దివాకర్(35), తన మిత్రుడు మహ్మద్​ కల్లు(34) పాతబస్తీ చత్రినాకలో నివాసం ఉంటున్నారు. ఈజీగా మనీ సంపాదించేందుకు వారు స్కెచ్ వేశారు. యూపీలోని తమ  వ్యవసాయ భూమిలో గోల్డ్ కాయిన్స్, బంగారు విగ్రహాలు లభించాయని ప్రచారం చేశారు. తక్కువ ధరలోనే బంగారు ఆభరణాలు, విగ్రహాలు అమ్ముతామని చెప్పారు. ముందుగా 10 గ్రాముల ఒరిజినల్ గోల్డ్ కాయిన్స్ ను తమ ట్రాప్ లో చిక్కిన వారికి ఇచ్చేవారు. తాము ఇచ్చిన గోల్డ్ కాయిన్స్ ను టెస్ట్ చేసుకోవాలని సూచించే వారు. తమ  ట్రాప్ లో చిక్కిన వారి  నుంచి అడ్వాన్స్ గా కొంత డబ్బు తీసుకునే వారు. ఆతరువాత ప్లాన్ ప్రకారం ఇత్తడి కాయిన్స్ ను గోల్డ్ అని సప్లయ్ చేసేవారు. ఇలా  ఇద్దరు కలిసి గతంలో  త్రివేండ్రం, కోయంబత్తుర్, తమిళనాడులో నకిలీ గోల్డ్ కాయిన్స్, మహావీర్ విగ్రహాలతో మోసాలకు పాల్పడ్డారు. ఇదే తరహాలో  అంబర్ పేట్ కు చెందిన కార్పెంటర్ సంజీవరావుని ఆగస్ట్ లో మహ్మద్ కల్లు సంజీవ రావును కలిశాడు. యూపీలోని తమ వ్యవసాయ భూమిలో గోల్డ్ కాయిన్స్, బంగారు విగ్రహం దొరికిందని చెప్పాడు. డబ్బులు అత్యవసరం కావడంతో అతి తక్కువ ధరకే అమ్మేస్తున్నామని కల్లు చెప్పాడు. కల్లు ట్రాప్ లో చిక్కిన సంజీవ నుంచి అడ్వాన్స్ గా  రూ.2లక్షలు వసూలు చేశారు.  సంజీవ ఇచ్చిన డబ్బుతో కల్లు యూపీ వెళ్ళాడు. అర్జున్ తో సంజీవను ట్రాప్ చేసిన విషయం చెప్పి అక్కడే  బంగారు పూత పూసిన ఇత్తడి కాయిన్స్, మహావీర్ విగ్రహం తీసుకున్నారు. దీంతో పాటు 10 గ్రాముల గోల్డ్ కాయిన్స్ కూడా కొనుగోలు చేశారు. ఆగస్ట్ 5న కల్లు, అర్జున్ సింగ్ కలిసి హైదరాబాద్ వచ్చి అంబర్ పేట్ లోని సంజీవ షాప్ కి వెళ్లి  నకిలీ గోల్డ్ కాయిన్స్ సంజీవ చేతికి ఇచ్చారు. అవి ఒరిజినలే నని సంజీవ నమ్మాడు. ఆగస్ట్ 28న మళ్ళీ సంజీవ షాప్ కి  వారిద్దరూ వచ్చి రూ.13.45 లక్షలు తీసుకుని గోల్డ్ కోటెడ్ 380 ఇత్తడి కాయిన్స్ సంజీవకి ఇచ్చారు. మొత్తం 3.8 కిలోల గోల్డ్ కాయిన్స్ అందిస్తున్నట్లు చెప్పి ఎస్కేప్ అయ్యారు.