నామ్​కేవాస్తేగా ఇంటిగ్రేటెడ్​ మార్కెట్.. రూ.8 కోట్లు పెట్టి కట్టినా అమ్మేది ఇద్దరే

నామ్​కేవాస్తేగా  ఇంటిగ్రేటెడ్​ మార్కెట్.. రూ.8 కోట్లు పెట్టి కట్టినా అమ్మేది ఇద్దరే
  • నారాయణపేటలో రోడ్లపైనే వ్యాపారుల అమ్మకాలు
  • అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టని ఆఫీసర్లు

నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వం రూ.8 కోట్లు ఖర్చు చేసి కట్టిన ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ 7 నెలలుగా అమ్మకాలు లేక వెలవెలబోతుంది. అక్కడ కేవలం ఇద్దరు  వ్యాపారులు మాత్రమే అమ్మకాలు చేస్తున్నారు. దీంతో 102 ఓపెన్​ దుకాణాలు, 10 షటర్లు నిరుపయోగంగా మారాయి. పట్టణంలో రోడ్ల విస్తరణ తరువాత ట్రాఫిక్​కు ఇబ్బంది కావడంతో చిరువ్యాపారులు, కూరగాయలు అమ్మేవారి కోసం రూ. 6 కోట్ల టీయూఎఫ్​ఐడీసీ ఫండ్స్ తో ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ నిర్మించాలని నిర్ణయించారు. 2021 జూన్​ 10న మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి నిధులు సరిపోవని మరో రూ.2 కోట్లు కేటాయించారు. మోడల్​ మార్కెట్​ కావడంతో ఏడాదిన్నరలోనే కంప్లీట్​ చేశారు. 2023 జనవరి 24న మంత్రి కేటీఆర్​ దీనిని ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ అద్భుతంగా ఉందని కేటీఆర్​తో పాటు బడ్జెట్​ సమావేశాల్లో సీఎం కేసీఆర్​ ఎమ్మెల్యేను అభినందించారు. 

ఇద్దరే అమ్ముతున్రు..

ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ కోసం బస్టాండ్​​దగ్గరలో ఉన్న స్థలాన్ని సేకరించి 102 ఓపెన్ దుకాణాలు, 10 షటర్స్​ను నిర్మించారు. ఓపెన్​ దుకాణాలను కేటాయించే అధికారం మున్సిపాలిటీ ఆఫీసర్లకు కేటాయించారు. షటర్స్​ టెండర్​ ద్వారా కేటాయించాలని నిర్ణయించారు. అయితే మార్కెట్​లో అమ్మకాలు చేసేందుకు వ్యాపారులు ముందుకు  రాలేదు. మొదట కొంత మంది వ్యాపారులు వచ్చినా, గిరాకీ సరిగా లేకపోవడంతో వారు తిరిగి రోడ్లపైనే అమ్మకాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే అది కూడా గేటు దగ్గర సరుకులు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. 

మార్కెట్​లు ఫుల్..

నారాయణపేట మున్సిపాలిటీలో మార్కెట్లు ఎక్కువయ్యాయి. జిల్లా ఆసుపత్రి ఎదుట కూరగాయల మార్కెట్​ మున్సిపల్​ షాప్స్​లో కొనసాగుతోంది. అదే స్థలంలో మటన్​ మార్కెట్​ ఉంది.  దీనికి దగ్గరలోనే రైతు బజార్, బయట షాపింగ్​ కాంప్లెక్స్​ నిర్మించారు. ఇక మాడ్రన్​ నాన్​వెజ్​ మార్కెట్ ను​జిల్లా ఆసుపత్రి పక్కన ఏర్పాటు చేశారు. ఇన్ని మార్కెట్​లు ఉండగానే, కోట్లు ఖర్చు పెట్టి ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ను నిర్మించారు. ఇందులో అమ్మకాలు జరగకపోవడంతో వెలవెలబోతోంది. ఇక ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​కు వినియోగదారులు రావడం లేదని చెబుతున్న చిరు వ్యాపారులు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో పార్కింగ్​కు సరైన స్థలం లేక ఇబ్బందిగా మారింది. 

గిరాకీ అయితలేదు..

బస్టాండ్​ ఎదురుగా నిర్మించిన మార్కెట్​లో గిరాకీ అయితలేదు. రోడ్లపైనే అన్ని దుకాణాలు ఉండడంతో అక్కడే కొంటున్నారు. ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ కు ప్రజలు వస్తే అక్కడికే పోతాం.

ఇస్మాయిల్, పూల వ్యాపారి

మార్కెట్​కు షిఫ్ట్ చేస్తాం..

ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​లో వ్యాపారం చేసుకోవాలని చెప్పినా, కొంత మంది సహకరించడం లేదు. వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించి మార్కెట్​కు చిరు వ్యాపారులను షిఫ్ట్​ చేస్తాం. త్వరలో అక్కడ వ్యాపారాలు షురూ అవుతాయి.

సునీత, మున్సిపల్​ కమిషనర్