
బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు బిగ్ బాస్ సీజన్ 16 హోస్ట్ గా నిర్వహిస్తున్నందుకుగానూ ఆయనకు రూ.1000 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారనే వార్త వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో విపరీతంగా సాగుతున్న ఈ ప్రచారంపై సల్మాన్ ఖాన్ స్పందించారు. తనకే గనక రూ.1000 కోట్లు వస్తే అసలు జీవితంలో పనిచేయనని తెలిపారు. ఒకవేళ ఈ అమౌంట్ వస్తుందనే వార్త నిజమే అయితే లాయర్ ఫీజులు లాంటివి తనకు చాలానే ఖర్చులున్నాయని చెప్పారు. సల్మాన్ ఇంత సంపాదిస్తున్నాడు.. ఇంత ఇస్తున్నాడు..ఇంత వస్తోంది... ఇంత పోతోంది అన్న విషయాలను గమనించడానికి, పరిశీలించడానికి ఆదాయపు పన్ను శాఖ, ఈడీ ఉండనే ఉంది కదా అంటూ కామెంట్స్ చేశారు. వాళ్లకు తెలుసు నిజమేంటో అని చెప్పుకొచ్చారు.
ఇక తాను బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్న అనుభవాన్ని గురించి ప్రస్తావించిన సల్మాన్ ఖాన్.. ఇప్పటికి 12 సంవత్సరాలైందని చెప్పారు. చాలా కాలం నుంచి ఈ షో చేస్తున్నానని, దీనికి చాలా అలవాటు పడ్డానని, ఈ ఆట అంటే తనకు ఇష్టమని, దీన్నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు. 2010 నుండి బిగ్ బాస్ టీవీ రియాలిటీ షో హోస్ట్ గా చేస్తోన్న సల్మాన్ ఖాన్... కొత్త సీజన్ గురించి చెబుతూ.. "ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఏది జరిగినా మంచే జరుగుతుంది" అని అన్నారు. ఈసారి గేమ్ భిన్నంగా ఉండబోతుందని.. ఎప్పటిలాగే ఇది బిగ్ బాస్ పోటీలో భాగమన్నారు. అంతే కాదు ఈ సీజన్ మిగతా సీజన్ ల కన్నా విభిన్నంగా, అనూహ్యంగా ఉండబోతుందని స్పష్టం చేశారు.