
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును పీసీసీ మేధావుల కమిటీ ప్రకటించింది. సోమవారం గాంధీ భవన్‌లో పీసీసీ మేధావుల కమిటీ ప్రతినిధులు కమలాకర్ రావు, శ్యామ్ మోహన్ మీడియాతో మాట్లాడారు. ఈ అక్టోబర్ 19న హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును ఖుర్షీద్‌కు అందజేయనున్నట్లు తెలిపారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. 1990 అక్టోబర్ 19న మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ చార్మినార్ వద్ద కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి జంట నగరాల్లో పాదయాత్ర చేశారని, దానికి గుర్తుగా ఏటా ఈ అవార్డును ప్రముఖులకు ఇస్తున్నట్లు తెలిపారు.