ఉప్పును తట్టుకునే వరి

ఉప్పును తట్టుకునే వరి

మామూలు వరిలోకి అడవి జాతి వరి జీన్స్​ ప్రవేశపెట్టి సృష్టి

ఉప్పును తట్టుకునే కొత్త రకం వరి వంగడాన్ని ఇండియన్​ సైంటిస్టులు సృష్టించారు. పోర్టరీసియా కోవర్క్​టాటా అనే అడవి జాతి రకం వరిలోని జీన్స్​ను తీసి వాడకంలో ఉన్న ఐఆర్​ 64 ఇండికా వరి రకంలోకి ప్రవేశపెట్టి ఈ కొత్త వంగడాన్ని సృష్టించారు. కోల్​కతాలోని బోస్​ ఇనిస్టిట్యూట్​కు చెందిన సైంటిస్టులు ఈ ఘనత సాధించారు. హాలోఫైట్స్​ అనే జాతికి చెందిన మొక్కల్లో ఉప్పును తట్టుకునే జీన్స్​ ఎక్కువగా ఉంటాయి. అందులో పోర్టరీసియా కోవర్క్​టాటా ఒకటి. ఆ మొక్క నుంచి పీసీఐఎన్​వో1 అనే జీన్​ను తొలిసారి తీశారు. ఆ జీన్​ ఉప్పున్నా కూడా ఐనోసిటోల్​ అనే విటమిన్​ లాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదే మొక్క నుంచి పీసీఐఎంటీ1 అనే జీన్​నూ తీశారు సైంటిస్టులు. ఈ రెండో జీన్​ ఐనోసిటోల్​ను పినిటోల్​ అనే మరో కాంపౌండ్​గా మారుస్తుంది. ఆ జీన్​లతోనే ఐఆర్​64 రకంలో మూడు కొత్త వంగడాలను సృష్టించారు.

పీసీఐఎన్​వో1ను ఐఆర్​64లోకి ప్రవేశపెట్టి ఒకటి, పీసీఐఎంటీ1ను ప్రవేశపెట్టి రెండోది, రెండు జీన్​లను పంపి మూడో వంగడాన్ని తయారు చేశారు. వీటన్నింటిలో పీసీఐఎన్​వో1ను ప్రవేశపెట్టి సృష్టించిన వంగడమే ఉప్పును ఎక్కువగా తట్టుకుని నిలబడగలిగిందని సైంటిస్టులు చెప్పారు. దాదాపు 200 మైక్రోమోల్స్​ లవణీయత ఉన్నా ఆ వంగడాల పెరుగుదల, సామర్థ్యం మెరుగ్గా ఉన్నట్టు చెప్పారు. మిగతా రెండు రకాలూ ఉప్పును అంత ఎక్కువగా తట్టుకోలేకపోతున్నాయని నిర్ధారించారు. పీసీఐఎన్​వో1ను ప్రవేశపెట్టిన ఐఆర్​64 కొత్త వంగడం నుంచి దిగుబడి ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు.