
- బీజేపీ నేత, యూపీ డిప్యూటీ సీఎం మౌర్యకు అఖిలేశ్ మాన్ సూన్ ఆఫర్
- రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన ఎస్పీ అధినేత ట్వీట్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంలో అంతర్గత కలహాలు చెలరేగుతున్న తరుణంలో సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ చేసిన ట్వీట్కలకలం రేపుతోంది. గురువారం ఆయన "మాన్ సూన్ ఆఫర్: సౌ లావో, సర్కార్ బనావో(100 మందిని తెండి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి)" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ స్టేట్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ అఖిలేశ్ యాదవ్ ట్వీట్ఆసక్తిని రేపుతోంది.
ఇది ఆయన డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యను ఉద్దేశించే చేసినట్టు తెలుస్తోంది. అయితే, అఖిలేశ్ ఇలాంటి ఆఫర్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022 డిసెంబర్ లోనూ ఇలాంటి ఆఫర్ ఇచ్చారు. "100 మంది ఎమ్మెల్యేలను తెచ్చి రాష్ట్రానికి సీఎం కావాలని" కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ కు ఆఫర్ చేశారు. ‘‘రాష్ట్రంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు.
వీరిద్దరూ సీఎం అయ్యే అవకాశం కోసం చూస్తున్నారు. మేము వారికి ఆఫర్ ఇవ్వడానికి వచ్చాం. 100 మంది ఎమ్మెల్యేలను తీసుకురండి.. మీరు కోరుకున్నట్టు సీఎం అవ్వండి. మేము మీ వెంట ఉన్నాం” అని రాంపూర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రకటించారు. కాగా, యూపీ బీజేపీలో తలెత్తిన క్రైసిస్ ఢిల్లీకి చేరుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనపై సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో బుధవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై వారు చర్చించారు. అలాగే, పార్టీ పనితీరుకు నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటానని చౌదరి ప్రధానికి తెలిపారు.
ఇదిలా ఉండగా.. పార్టీ, ప్రభుత్వం రెండింటిలోనూ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని మోదీతో సమావేశం తర్వాత పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఈ వర్గం ఓటర్లు పార్టీకి దూరమయ్యారని, ఫలితంగా అనేక సీట్లు కోల్పోయినట్టు పేర్కొన్నాయి.