
- ఈ షోలో పాల్గొననున్న మొదటి ఇండియన్ మెజీషియన్‌గా రికార్డు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మెక్సికోలో జరగనున్న నోబెల్ శాంతి గ్లోబల్ సమ్మిట్‌లో ప్రముఖ మెజీషియన్ సామల వేణు ప్రదర్శన ఇవ్వనున్నాను. సెప్టెంబర్ 18 నుంచి 21 వరకు మెక్సికోలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన 19వ నోబెల్ శాంతి గ్లోబల్ సమిట్‌లో ప్రదర్శన ఇవ్వనున్న మొదటి ఇండియన్ మెజీషియన్‌గా వేణు చరిత్ర సృష్టించనున్నారు.
మోంటెర్రీ, మెక్సికోలో జరగనున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా నోబెల్ శాంతి గ్రహితలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఈవెంట్‌లో నా మ్యాజిక్‌ను పంచుకునే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను.
ఇది నాకు గర్వకారణం’’అని పేర్కొన్నారు. కాగా, మెజీషియన్‌గా సామల వేణుకు 42 ఏండ్ల అనుభవం ఉంది. ఆయన తన ఇప్పటివరకు 30 కంటే ఎక్కువ దేశాల్లో వెయ్యి ప్రదర్శనలు ఇచ్చారు.
రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు, రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు. మ్యాజిక్ రంగానికి చేసిన కృషికి గాను దేశంలోని పలు రాష్ట్రాలు ఆయనకు పురస్కారాలు అందజేశాయి. అలాగే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ మెజీషియన్స్ (యూఎస్ఏ) ద్వారా మెర్లిన్ అవార్డు, యూఎస్ఏలో ఇండో- అమెరికన్ యూత్ అవార్డు, ప్రశంసా పురస్కారం అందుకున్నారు.
సామాజిక సేవలో భాగంగా బ్రిటన్‌లోని యూరోపియన్ తెలుగు అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆయనను ప్రశంసించారు. అలాగే, 2008లో మెజీషియన్స్ అకాడమీని వేణు స్థాపించారు. అతను 2014లో యూనివర్సిటీ స్థాయిలో ‘‘డిప్లొమా ఇన్ మ్యాజిక్’’అనే రెగ్యులర్ కోర్సును కూడా ప్రారంభించారు.