సమంత లీడ్ గా నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంతకు చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. సోమవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. యాక్షన్‌తోపాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
‘నా ప్రాణం అడ్డు పెట్టయినా నా ఫ్యామిలీకి ఏంకాకుండా చూసుకుంటాను.. ఒక్కొక్కరినీ కొడతాను చూడు.. ప్రేమతో అబ్బా’ అని సమంత చెప్పిన డైలాగులు సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో సమంత మాట్లాడుతూ ‘ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నా. ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అయినా డ్రామా, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంటాయి. చీర కట్టులో యాక్షన్ చేయడం కొత్తగా ఉంది’ అని చెప్పారు.
నందిని రెడ్డి మాట్లాడుతూ ‘ఒకప్పటితో పోలిస్తే.. సమంత ఇప్పుడు నటిగా మరో మెట్టు ఎక్కింది. కామెడీ, యాక్షన్, ఎమోషన్.. అన్నింటిలోనూ ఆమె అదరగొడుతుంది. అందరిలాగే నేను కూడా తనకి అభిమానినే’ అని అన్నారు. నిర్మాత రాజ్ నిడిమోరు మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో సమంత యాక్షన్ అవతార్‌లో కనిపిస్తుంది. ‘మా ఇంటి బంగారం’ టైటిల్ వెనుక చాలా కథ ఉంది. ప్రతి ఇంట్లో తమ ఆడపిల్లలను ముద్దుగా పిలుచుకునే పేరు ఇది.
మాది తిరుపతి కావడంతో ఈ సినిమాలో సమంతతో తిరుపతి యాసలో మాట్లాడించాం. ప్రేక్షకులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉంటాయి’ అని చెప్పారు. ఈ చిత్రంలో సమంత యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని నిర్మాత హిమాంక్ అన్నారు. నటులు శ్రీముఖి, గవిరెడ్డి పాల్గొన్నారు.
