ఒకే నంబర్..బండ్లు ఎన్నో.!

ఒకే నంబర్..బండ్లు ఎన్నో.!

హైదరాబాద్, వెలుగు:మీ బండి నంబర్​, మరో వాహనం నంబర్ ఒక్కటే ఉందా? సేమ్​ మీ బండి నంబర్​తోనే వేరే వాహనం ఏదైనా తిరుగుతున్నట్టు మీకు తెలుసా? ఇవేం ప్రశ్నలు!! ఒక రిజిస్ట్రేషన్​ నంబర్​తో ఒకే బండి ఉంటుందని అంటారా.. కానీ రాష్ట్రంలో చాలా వాహనాలు వేరే బండ్ల నంబర్లతో నకిలీ నంబర్​ ప్లేట్లు పెట్టుకుని తిరిగేస్తున్నాయి. ట్యాక్సులు కట్టకుండా తప్పించుకోవడానికి, ట్రాఫిక్​ చలానాలు తమకు పడకుండా ఉండేందుకు కొందరు తమ బండ్లకు నకిలీ నంబర్​ ప్లేట్లు బిగించుకుంటున్నారు. కొందరు ఏదో ఒక వాహనం నంబర్​తో నకిలీ ప్లేట్లు తయారు చేసుకుంటుంటే.. ఇంకొందరు అచ్చం తమ బండి మోడల్, సేమ్​ కలర్​తో ఉన్న వేరే వాళ్ల బండ్ల నంబర్లను పెట్టేసుకుంటున్నారు. ముఖ్యంగా ట్రావెల్స్ వాహనాలు, పాసింజర్​ బస్సులు, లారీలకు ఇలా నకిలీ నంబర్​ ప్లేట్లు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. ఆర్టీఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ వ్యవహారం సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చలానాతో బట్ట బయలు..

పర్వతాలు అనే వ్యక్తి పది నెలల క్రితం వేరే వ్యక్తి దగ్గర స్వరాజ్​ మజ్దాను కొన్నారు. ఇటీవల ట్రాఫిక్​ పోలీసులు ఆయనకు రెండు చలానాలు పంపించారు. వాటిల్లోని ఫొటోలో ఉన్నది ఆయన వాహనం కాదు. తన బండి నంబర్​తో ఎవరో వేరే బండి నడుపుతున్నారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేదు. తర్వాత ఆయనే ప్రయత్నం చేసి.. నకిలీ నంబర్​ ప్లేట్​ ఉన్న వాహనాన్ని పట్టుకుని జగద్గిరిగుట్ట పోలీస్​ స్టేషన్​లో అప్పగించారు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోతున్నాడు. నకిలీ నంబర్​ ప్లేటుతో దొరికిన బండి ఓనర్ ఇలాగే మరో నాలుగైదు వాహనాలనూ నడుపుతున్నాడని సమాచారం.

ఇట్ల చేస్తున్నరు..

కొందరు వ్యక్తులు సెకండ్​హ్యాండ్​ బండి కొంటామంటూ డాక్యుమెంట్లు తీసుకుంటున్నారు. వాటిని జిరాక్స్​ తీయించి దగ్గర పెట్టుకుంటున్నారు. తర్వాత ఆ నంబర్​ మీదే నకిలీ నంబర్​ ప్లేట్లు తయారు చేసి వేరే బండ్లకు పెడుతున్నారు. ట్రాఫిక్​ ఉల్లంఘనలకు సంబంధించి పోలీసులు ఫొటో తీసి పంపుతున్న చలాన్లు అసలు ఓనర్లకు వెళుతున్నాయి. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టేందుకే ఇలా నకిలీ ప్లేట్లను పెట్టుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ నకిలీ నంబర్​ ప్లేట్ల వ్యవహారం ఆర్టీఏ అధికారులకు తెలిసినా పట్టించుకోవట్లేదని రాష్ట్ర ఫోర్​ వీలర్స్​ అసోసియేషన్​ నేతలు ఆరోపిస్తున్నారు. తూతూ మంత్రంగా తనిఖీలు చేసి, వదిలేస్తున్నారని అంటున్నారు. ఆర్టీఏ అధికారులు మాత్రం తమ దృష్టికి వస్తే క్రిమినల్​ కేసులు నమోదు  చేస్తామని చెబుతున్నారు.