లిక్కర్ స్కాం కేసు:  సమీర్ మహేంద్రు, అరుణ్ పిళ్లైకు తాత్కాలిక బెయిల్

లిక్కర్ స్కాం కేసు:  సమీర్ మహేంద్రు, అరుణ్ పిళ్లైకు తాత్కాలిక బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి రౌస్ అవెన్యూ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. సమీర్ మహేంద్రు, అరుణ్ పిళ్లైతో పాటు ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులైన కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, ముత్తా గౌతమ్లకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. సీబీఐ అందులో ఏడుగురు నిందితుల పేర్లు నమోదు చేసింది. ఈ క్రమంలోనే నిందితుల బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఏడుగురిలో ఐదుగురికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది.

లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ లకు సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసినా ఈడీ కేసులో బెయిల్ రాకపోవడంతో వారు ఇంకా జైలులోనే ఉన్నారు. ఇదిలా ఉంటే లిక్కర్ స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ఈ నెల 5న అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది.