సమ్మక్క బ్యారేజ్ గేట్లు ఓపెన్.. రామన్నగూడెం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ

సమ్మక్క బ్యారేజ్ గేట్లు ఓపెన్.. రామన్నగూడెం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ

ఏటూరు నాగారం, వెలుగు: ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలతో పాటు పైన ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో భారీగా వరద గోదావరిలోకి వస్తోంది. దీంతో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెం వద్ద సమ్మక్క బ్యారేజ్ గేట్లను అధికారులు ఓపెన్​ చేశారు. ఎగువన శ్రీరామ సాగర్, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి, లక్ష్మీబారేజి (మేడిగడ్డ బారేజి) గేట్లు తెరవడంతో పాటు ఇంద్రావతి నది నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. 

బుధవారం (సెప్టెంబర్ 03) సాయంత్రం  సమ్మక్క బ్యారేజ్ 59 గేట్లను పైకి ఎత్తి  8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.  ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్​వద్ద నదిలో వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు నీటిమట్టం 14.820 మీటర్లు దాటగా అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 

నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​దివాకర టీఎస్ సూచించారు.  నీటిమట్టం 15.820 మీటర్లకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే చాన్స్ ఉంది.