ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ మినీ జాతర

ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ మినీ జాతర
  • భారీగా తరలివచ్చిన భక్తజనం
  • సమ్మక్క సారలమ్మ దేవాలయాల్లో శుద్ధి
  • అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: ఆదివాసీ సంస్కృతి.. సంప్రదాయాల ప్రకారం మేడారంలో సమ్మక్క సారలమ్మ మినీ జాతర బుధవారం ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వానాలు.. పూనకాలతో మేడారం మారుమోగింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆదివాసీ పూజారులు మండమెలిగే పండుగను ప్రారంభించారు. 2022 మహాజాతర ముగిసిన ఏడాది తర్వాత మళ్లీ వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. మేడారం మినీజాతర సందర్భంగా ఆదివాసీ పూజారులు కుటుంబసభ్యులతో కలిసి డోలువాయిద్యాలు, సన్నాయి మేళాల నడుమ ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం మంగళహారతులు చేతబూని అమ్మవార్ల గద్దెల వద్దకు ఊరేగింపుగా వచ్చారు.

చలపయ్యగా పిలుచుకునే లేగదూడ మొక్కును చెల్లించారు. మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మినీ జాతర కోసం రూ.3.10 కోట్లతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. మంత్రి వెంట ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీఓ అంకిత్, ఎస్పీ గౌస్ ఆలం తదితరులు ఉన్నారు.